కలిసిపోతే అక్కడ సైకిల్‌దే హవా...!
కృష్ణా జిల్లాల్లో ప్రతిపక్ష టీడీపీ కష్టాల్లో ఉన్న నియోజకవర్గాల్లో నూజివీడు ఒకటి. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి కాస్త అనుకూలంగా ఉండేది. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన 9 ఎన్నికల్లో టీడీపీ ఐదు సార్లు విజయం సాధించింది. రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ గెలిచింది. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ టీడీపీకి గెలుపు దక్కడం లేదు.
వైసీపీ తరుపున మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలుస్తూ వస్తున్నారు. ఈయన 2004లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్నారు. అయితే నూజివీడులో టీడీపీకి తక్కువ బలం ఏమి లేదు. ఇక్కడ టీడీపీలో ఉన్న వర్గపోరు వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక్కడ టీడీపీలో కమ్మ సామాజికవర్గం హవా ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ తరుపున పోటీ చేస్తూ వస్తున్నారు.
యాదవ సామాజికవర్గానికి చెందిన ముద్దరబోయిన గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఒకసారి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ముద్దరబోయిన కాంగ్రెస్‌ని వీడి వైసీపీలోకి వచ్చారు. ఈ క్రమంలోనే 2014లో నూజివీడు టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే, నూజివీడులో మాత్రం వైసీపీ గెలిచింది. టీడీపీలో ఉన్న వర్గపోరు వల్లే ముద్దరబోయిన ఓటమి పాలయ్యారు.
నియోజకవర్గంలో ఉన్న కమ్మ నేతలు, ముద్దరబోయినని కలుపుకుని వెళ్ళే పరిస్తితి కనిపించడం లేదు. అదే సమయంలో ముద్దరబోయిన కూడా నియోజకవర్గంలో దూకుడుగా పనిచేయడం లేదు. అందుకే 2019 ఎన్నికల్లో సైతం నూజివీడులో టీడీపీకి ఓటమి తప్పలేదు. ఎన్నికలై రెండేళ్ళు అయినా సరే నూజివీడులో టీడీపీ అదే పరిస్తితిలో ఉంది. ఇంకా ఇక్కడ పార్టీలో వర్గపోరు తగ్గలేదు. ఇటు ముద్దరబోయిన యాక్టివ్‌గా ఉండటం లేదు. అందుకే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఘోరంగా ఓడింది. అయితే ఇక్కడ నాయకులు కలిసి పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గెలిచే ఛాన్స్ ఉంటుంది. లేదంటే కథ మొదటికే వస్తుంది.