గౌరు చరితా లైన్‌లోకి వచ్చినట్లేనా!

M N Amaleswara rao

గౌరు చరితారెడ్డి....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకురాలు. దివంగత వైఎస్సార్‌కు అంత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకురాలు. వైఎస్సార్, చరితాని సోదరిగా భావించి 2004లో నందికొట్కూరు కాంగ్రెస్ టిక్కెట్ కూడా ఇచ్చారు. ఇక వైఎస్సార్ వేవ్‌లో చరితా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక వైఎస్సార్ మరణం తర్వాత చరితా జగన్ వెంట నడిచారు. జగన్‌కు అండగా ఉంటూ వైసీపీలో బలమైన నాయకురాలుగా ఎదిగారు.


ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో చరితా పాణ్యం నుంచి పోటీ చేసి గెలిచారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా సరే, జగన్‌కు సపోర్ట్‌గా ఉన్నారు. అయితే పాణ్యంలో బలంగా ఉన్న కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. ఈయన అంతకముందు కాంగ్రెస్ నుంచి ఐదు సార్లు పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఇండిపెండెంట్‌గా నిలబడి 60 వేల ఓట్లు వరకు తెచ్చుకున్నారు.


ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళి పాణ్యం టిక్కెట్ దక్కించుకున్నారు. దీంతో చరితా రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరి అక్కడ టిక్కెట్ దక్కించుకున్నారు. జగన్ వేవ్, కాటసాని ఇమేజ్‌ల ముందు చరితా నిలబడలేకపోయారు. కాటసాని చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇలా ఓడిపోయాక చరితా రెడ్డి టీడీపీలో యాక్టివ్‌గా లేరు. ఈ క్రమంలోనే చరితా రెడ్డి భర్త వెంకటరెడ్డికి చంద్రబాబు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఆ ఫ్యామిలీ మళ్ళీ యాక్టివ్ అయింది.


గత కొన్ని రోజుల నుంచి చరితా రెడ్డి సైతం పాణ్యంలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. తాజాగా పాణ్యం నియోజకవర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలని ప్రత్యర్ధులు చంపేశారు. దీంతో ఆమె చనిపోయిన కుటుంబ సభ్యులని పరామర్శించింది. వైసీపీ ప్రభుత్వం ప్రజలని భయపెడుతుందని మాట్లాడారు. తాజాగా లోకేష్ కర్నూలు పర్యటనకు రాగా, ఆయన వెనుకే చరితా ఉన్నారు. ఇక లోకేష్ ఎంట్రీతో పాణ్యం రాజకీయాలు మారాయి. ఇక నుంచి చరితా కూడా టీడీపీలో దూకుడుగా ఉండేలా కనిపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: