గంటా రాజీనామా ఏమైంది? పోరాటం కూడా లేదే?

M N Amaleswara rao

గంటా శ్రీనివాసరావు....ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా ఇంతవరకు ఓటమి ఎరుగని నాయకుడు. తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గంటా, 1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్ళి అనకాపల్లి ఎమ్మెల్యేగా 2009లో గెలిచారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో విలీనం కావడంతో, అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.


రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పరిస్తితి ఘోరంగా తయారవ్వడంతో మళ్ళీ టీడీపీలోకి వచ్చి 2014లో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున గెలిచారు. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గంటా సైలెంట్ అయిపోయారు. అనేక సార్లు ఈయన పార్టీ మారిపోతారని ప్రచారం జరిగింది. కానీ గంటా పార్టీ మారలేదు. అలా అని టీడీపీలో యాక్టివ్‌గా లేరు.


అయితే ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. కానీ స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయలేదని విమర్శలు రావడంతో మరొకసారి గంటా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశారు. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాంని కలిసి రాజీనామాని ఆమోదించాలని కోరారు. ఇక అప్పుడు మాత్రమే కనిపించిన గంటా, మళ్ళీ ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించలేదు.


అసలు ఆయన రాజీనామా ఏమైంది? స్పీకర్ గంటా రాజీనామా ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారా? అనే విషయాలు ఏవి తెలియడం లేదు. పైగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన గంటా, ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఎక్కడా పోరాటం చేస్తున్నట్లు కనిపించలేదు. మొదట్లో కొన్నిరోజులు మీడియాలో మాట్లాడటమే చేశారుగానీ, డైరక్ట్‌గా ఫీల్డ్‌లోకి దిగి స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయలేదు. ఇప్పటికీ గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సైలెంట్‌గానే ఉన్నారు. మరి దీని బట్టి చూస్తే గంటా రాజీనామా కూడా రాజకీయంలాగానే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: