దూడల సీరంతో కొవాగ్జిన్ టీకా... షాకింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం?
అయితే ఆర్టీఐ ఏమని ప్రశ్నించిందంటే.. భారత్ బయోటెక్ తయారుచేసిన.. భారత ప్రభుత్వం ఆమోదించిన కొవాగ్జిన్ తయారీ విధానంలో ఫీటల్ బోవిన్ సీరం ని (పశుసంబంధి/గోజాతి పిండం సీరం) ఏ రూపంలోనైనా వినియోగిస్తారా? లేదా టీకా తయారీ పదార్థాలలో వినియోగిస్తారా? లేక టీకా మిశ్రమంలో ఉపయోగిస్తారా? అని ప్రశ్నించింది.
అయితే ఈ ప్రశ్నకు.. "భారత్ బయోటెక్ సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆవు దూడల సీరం వీరోకణాలు అభివృద్ధి కోసం వినియోగిస్తారు. కొవాగ్జిన్ టీకా భారీ ఎత్తున తయారు చేస్తున్న క్రమంలో కరోనా వైరస్ ఉత్పత్తి చేసేందుకు వీరోకణాలు వినియోగిస్తారు," అనే సమాధానం ప్రత్యక్షమయ్యింది.
ఈ క్రమంలోనే ఆనంద్ రంగనాథన్ అనే ఒక జే.ఎన్.యూ ప్రొఫెసర్ గౌరవ్ పాండి చేసిన ఆరోపణలపై స్పందించారు. "మీరు ఆరోపించినట్టు కొవాగ్జిన్ టీకాలో ఆవు దూడల సీరం ఉండదు. సీరం కోసం ఆవులను వధించరు. మరిన్ని వైరస్లను తయారుచేయడానికి కణాలను పెంచేందుకు సీరం వినియోగిస్తారు. ఈ సమాచారం 2020 సెప్టెంబర్ నెల నుంచే ప్రజాధికారపరిధిలో ఉంది," అని ఆనంద్ రంగనాథన్ ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. "సోషల్ మీడియా పోస్టులలో నిజాలు వక్రీకరించబడి తప్పుగా సూచించబడ్డాయి. ఆవుదూడల సీరం వీరోకణాల పెరుగుదల కోసమే వినియోగిస్తారు. వివిధ రకాల పశువులు, ఇతర జంతువుల సీరం వీరోకణాల పెరుగుదలకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ప్రామాణిక సుసంపన్న పదార్ధం. టీకాల ఉత్పత్తికి సహాయపడే జీవకణాలను అభివృద్ధి చేయడానికి వీరోకణాలు దోహద పడతాయి. పోలియో, రాబిస్, ఇన్ఫ్లూయాంజా వ్యాక్సిన్లలు తయారుచేయడానికి ఇదే తరహాలో సీరం ఉపయోగిస్తున్నారు, ”అని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.
"ఈ వీరోకణాలు బాగా అభివృద్ధి చెందిన తర్వాత నీటితో శుద్ధి చేస్తారు. వీరోకణాల నుంచి సీరం తొలగిపోవడానికి కెమికల్స్ తో చాలాసార్లు అభివృద్ధి చేస్తారు. సాంకేతికంగా చెప్పాలంటే.. దీనిని బఫర్ అంటారు. తర్వాత వైరల్ పెరుగుదల కోసం ఈ వీరోకణాలను కరోనా వైరస్ తో ఇన్ ఫెక్ట్ చేస్తారు. వైరల్ పెరుగుదల క్రమంలో వీరోకణాలు పూర్తిగా నశింప బడతాయి. ఆ తర్వాత ఈ కణాల సహాయంతో పెరిగిన వైరస్లను కూడా చంపేసి శుద్ధీకరిస్తారు. చంపేసిన కరోనా వైరస్లతోనే ఫైనల్ గా వ్యాక్సిన్ ని తయారు చేస్తారు. ఫైనల్ వ్యాక్సిన్ తయారీలో ఎటువంటి దూడల సీరం ఉండదు...
అందువల్ల, ఫైనల్ వ్యాక్సిన్ (కొవాగ్జిన్) లో దూడ సీరం ఉండదు. దూడ సీరం ఫైనల్ టీకా ఉత్పత్తికి ఒక పదార్ధం కాదు, " అని కేంద్ర మంత్రిత్వ శాఖ ఇదే ప్రకటనలో వివరంగా తెలిపింది.