కమ్మ వర్గానికి బాబు చెక్...జవహర్‌కే ఫిక్స్!
పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడు టీడీపీ అనుకూలంగా ఉండే నియోజకవర్గం. ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఈ జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలే వచ్చేవి. అయితే గత ఎన్నికల్లో మాత్రం అంతా తిరగబడిపోయింది. టీడీపీ దారుణంగా ఓడిపోయి కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. కంచుకోటల్లాంటి స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. అయితే ఇప్పుడు కంచుకోటలని తిరిగి నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గమైన కొవ్వూరు టీడీపీ బాధ్యతలని మాజీ మంత్రి జవహర్‌కు అప్పగించడం దాదాపు ఖరారైపోయిందని తెలుస్తోంది. మామూలుగానే కొవ్వూరు టీడీపీకి కంచుకోట. 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ కేవలం ఒక్క 1999 ఎన్నికల్లో మాత్రమే ఓడింది. 7 సార్లు టీడీపీ గెలిచింది. 2014లో జవహర్ ఇక్కడ నుంచే గెలిచారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే నియోజకవర్గంలో ఉండే కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకులు జవహర్‌కు చెక్ పెట్టాలని చూశారు.
ఆయనకు 2019 ఎన్నికల్లో టిక్కెట్ రాకుండా గట్టిగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబు జవహర్‌కు తిరువూరు టిక్కెట్ ఇచ్చారు. అలాగే పాయకరావుపేటకు చెందిన వంగలపూడి అనితని కొవ్వూరులో నిలబెట్టారు. ఇక జగన్ వేవ్‌లో ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయాక అనితని మళ్ళీ పాయకరావుపేటకు పంపించేశారు. అలాగే జవహర్ తిరువూరు వదిలేసి వచ్చారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు, జవహర్‌కు రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. కొవ్వూరు అసెంబ్లీ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. దీంతో జవహర్ కొవ్వూరులోనే సెటిల్ అయిపోయారు. ఓవైపు పార్లమెంట్ బాధ్యతలు చూసుకుంటూనే, మరోవైపు కొవ్వూరులో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
అయితే కొవ్వూరులో జవహర్‌ని రీప్లేస్ చేసే నాయకుడు మరొకరు లేరు. దీంతో కొవ్వూరు బాధ్యతలు జవహర్‌కే అప్పగించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు బరిలో జవహర్‌ని నిలబెట్టడం ఫిక్స్ అయినట్లే అని సమాచారం. మొత్తానికైతే కమ్మ సామాజికవర్గానికి చెక్ పెడుతూ, జవహర్ మళ్ళీ కొవ్వూరులో సెట్ కానున్నారు.