టార్గెట్ పల్లా: వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే?

M N Amaleswara rao

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్న విషయం తెల్సిందే. వైసీపీ అనుకూల మీడియా జగన్‌కు భజన చేస్తూ, చంద్రబాబు, టీడీపీ నేతల టార్గెట్‌గా బురద చల్లే కార్యక్రమం చేస్తుంది. అటు టీడీపీ అనుకూల మీడియా బాబుకు భజన చేస్తూ, జగన్‌పై విమర్శలు చేస్తూ ఉంటుంది.


ఇక ఈ మీడియా రాజకీయాలు ఎప్పటినుంచో నడుస్తూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఆ మీడియా సంస్థలు అదే పనిగా పెట్టుకుని ముందుకెళ్తాయి. ఈ మధ్య వైసీపీ అనుకూల మీడియా టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు టార్గెట్‌గా ఆరోపణలు గుప్పిస్తుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా, పల్లా అనేక ఎకరాల ప్రభుత్వ భూములని కబ్జా చేశారని ఆరోపణలు చేస్తుంది. అలాగే ఈ ఆరోపణలపై విశాఖలోని అధికారులు విచారణ కూడా చేస్తున్నారని, ఇందులో అనేక నిజాలు బయటపడుతున్నాయని చెబుతోంది.


పల్లా కోట్ల విలువైన భూములని కబ్జా చేసి పలు ప్రైవేట్ సంస్థలకు లీజులకు కూడా ఇచ్చారని కథనాలు ప్రచురిస్తుంది. దానికితోడు పల్లా ఏ భూములని కబ్జా చేశారో సర్వే నెంబర్లతో సహ చెబుతోంది. అయితే వైసీపీ అనుకూల మీడియా పల్లాపై చేసే ఆరోపణలు కరెక్ట్ కాదని స్థానిక టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు పల్లా సైతం ఈ ఆరోపణలపై స్పదించి వైసీపీకి కౌంటర్ కూడా ఇచ్చారు. మొన్న ఆ మధ్య అక్రమ కట్టడమని చెప్పి పల్లాకు చెందిన ఓ భవనాన్ని కూల్చేశారు.


వైసీపీలోకి రావడం లేదనే చెప్పే జగన్, జగన్ అనుకూల మీడియా కక్ష సాధిస్తుందని పల్లా ఆరోపించారు. అయితే ఇటీవల విశాఖ రాజకీయాల్లో పల్లా కీలకంగా మారిపోయారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన పల్లా ఇప్పుడు విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. అలాగే ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసి హైలైట్ అయ్యారు. అలాగే రాష్ట్రంలోని అన్నీ కార్పొరేషన్‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోతే, విశాఖలో మాత్రం చెప్పుకోదగిన స్థానాలు గెలుచుకుంది.


మొత్తం 98 డివిజనల్లో వైసీపీ 58 గెలుచుకుంటే, టీడీపీ 30 గెలుచుకుంది. ఇతరులు 10చోట్ల గెలిచారు. టీడీపీ ఈస్థాయిలో గెలవడానికి పల్లా కూడా కారణం. ఇలా బలంగా ఉన్న పల్లాని వైసీపీలోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం కూడా వచ్చింది. కానీ పల్లా టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈ కారణంతోనే తన మీద కక్ష సాధిస్తున్నారని పల్లా అంటున్నారు. ఒకవేళ పల్లా వైసీపీలోకి వెళితే ఈ ఆరోపణలు రావేమో. ఎందుకంటే గతంలో టీడీపీలో ఉన్నప్పుడు పలు ఆరోపణలు ఎదురుకున్నవారిపై, వైసీపీలోకి వెళ్ళాక ఎలాంటి ఆరోపణలు రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: