ఆ విషయాలు బాబు ఎందుకు చెప్పలేదు యనమల?
కేసులు మాఫీ కోసం, బెయిల్ రద్దు అవుతుందనే భయంతోనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని టీడీపీ నేతలు ప్రతిసారి విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అసలు జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళిన టీడీపీ నాయకులు ఇలాగే మాట్లాడుతుంటారు. తాజాగా కూడా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళి, రాష్ట్రంలోని సమస్యలు, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అంశంపై కేంద్ర మంత్రులతో మాట్లాడారు.
కానీ జగన్ ఢిల్లీకి వెళ్ళి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాని కలిస్తే చాలు, కేసులు మాఫీ కోసమే అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పైగా ఇటీవల ఎంపీ రఘురామకృష్ణంరాజు, జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి జగన్ విచారణకు హాజరు కావాలని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక బెయిల్ రద్దు అయ్యి, మళ్ళీ జైలుకు వెళ్లాలనే భయంతోనే జగన్, సడన్‌గా ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రతిపక్ష టీడీపీ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారు.
తాజాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారని, అలా కానప్పుడు ఢిల్లీ పెద్దలతో ఏం చర్చించారో జగన్, మీడియాకి వివరించాలని యనమల డిమాండ్ చేస్తున్నారు. అసలు ఢిల్లీకెళ్ళిన ప్రతిసారి జగన్, మంత్రులతో సమావేశమైన వివరాలని మీడియాకు ఎందుకు చెప్పరని అడుగుతున్నారు. మీడియాకు చెప్పడం లేదంటే జగన్, ఢిల్లీ పెద్దలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నట్లే అని చెబుతున్నారు.
అయితే గతంలో చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో అందరికీ తెలుసని, అప్పుడు కూడా బాబు మీడియాతో కేంద్ర పెద్దలతో సమావేశమైన వివరాలని చెప్పిన సందర్భాలు లేవని వైసీపీ శ్రేణులు, యనమలకు కౌంటర్లు ఇస్తున్నాయి. అసలు కేంద్ర మంత్రులతో జగన్ చర్చించే ప్రతి అంశం మీడియాలో వస్తుందని, అలాంటప్పుడు ప్రత్యేకంగా మీడియాకు చెప్పాల్సింది ఏమి ఉంటుందని అంటున్నారు.