ఆ కొత్త మంత్రులకు జగన్ బంపర్ ఆఫర్...?
ఏపీ శాసనమండలి రద్దుకు సీఎం జగన్ మొగ్గుచూపడం ఓ ఇద్దరు ఎమ్మెల్యేలకు బాగా కలిసొచ్చిందనే చెప్పొచ్చు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండటంతో, ప్రతి బిల్లుకు అడ్డంకి ఎదురుకావడంతో సీఎం జగన్ గతేడాది మండలి రద్దుకు మొగ్గుచూపారు. అసెంబ్లీలో మండలి రద్దు బిల్లు పెట్టి, దానికి ఆమోదముద్ర వేసి, కేంద్రానికి పంపారు. అయితే ఆ రద్దు అంశం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదుగానీ, మండలి రద్దు కానుండటంతో ఎమ్మెల్సీలుగా ఉండి, తన కేబినెట్‌లో ఉన్న పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణల చేత జగన్ రాజీనామా చేయించారు.
పిల్లి, మోపిదేవిలు ఎమ్మెల్సీ పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. అయితే వాళ్ళకు అన్యాయం జరగకుండా జగన్ రాజ్యసభ ఇచ్చారు. ఇదే సమయంలో ఈ ఇద్దరు మంత్రులుగా తప్పుకోవడం వల్ల సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్‌లకు అదృష్టం కలిసొచ్చింది. గతేడాది జూలైలో మోపిదేవి స్థానంలో అప్పలరాజు, పిల్లి సుభాష్ స్థానంలో చెల్లుబోయినలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
అంటే వారు మంత్రులుగా ప్రమాణం చేసి ఏడాది కాలేదు. అయితే జగన్ మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. పనితీరు, కులాలు, జిల్లాల సమీకరణాల ఆధారంగా పాతవారిని తప్పించి, కొత్తవారికి ఛాన్స్ ఇవ్వనున్నారు. జగన్ మంత్రివర్గంలో సగం పైనే రీప్లేస్ జరగొచ్చని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో కొత్తగా మంత్రులైన అప్పలరాజు, వేణుగోపాల్ పదవులు కంటిన్యూ అవుతాయా? లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులని బట్టి చూస్తే ఈ ఇద్దరు జగన్ కేబినెట్‌లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అప్పలరాజు మత్స్యకార వర్గానికి చెందిన ఎమ్మెల్యే. అయితే వైసీపీలో ఈ వర్గానికి చెందిన ఎమ్మెల్యే మరొకరు లేరు. అటు చెల్లుబోయిన శెట్టిబలిజ/గౌడ వర్గానికి చెందిన వ్యక్తి. ఈ వర్గంలో జోగి రమేష్, వెంకట్ గౌడలు ఉన్నారు. కానీ కొత్తగా మంత్రి అయిన చెల్లుబోయినని జగన్ తప్పించే అవకాశాలు లేవని తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ఇద్దరు కొత్త మంత్రులకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే అని తెలుస్తోంది.