రాజమండ్రిలో జవహర్‌కు కష్టమే...అసలు లీడింగ్ లేదుగా!
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఈ రెండేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎప్పుడూలేని విధంగా పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. అధ్యక్షులని పెట్టి పది నెలలు దాటేస్తుంది. ఈ పది నెలల కాలంలో ఏ ఒక్క పార్లమెంట్ స్థానంలో టీడీపీ పరిస్తితి మెరుగైనట్లు కనిపించడం లేదు. ఎక్కడకక్కడే పార్టీ వీక్‌గా కనిపిస్తోంది.
ఈ క్రమంలోనే రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో కూడా టీడీపీ పరిస్తితి ఘోరంగానే ఉంది. రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి అధ్యక్షుడుగా మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఉన్నారు. ఇక ఈయన రాజమండ్రి పరిధిలో టీడీపీని బలోపేతం చేసినట్లు కనిపించడం లేదు. పదవి వచ్చిన మొదట్లో కాస్త హడావిడిగా పార్లమెంట్ స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి నాయకులని కలిశారుగానీ, తర్వాత మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.
రాజమండ్రి పరిధిలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, గోపాలాపురం, నిడదవోలు స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రూరల్ స్థానాల్లో టీడీపీ గెలిచింది. మిగిలిన ఐదు స్థానాల్లో వైసీపీ గెలిచింది. అయితే సిటీ, రూరల్ స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు బలంగానే ఉన్నారు. కానీ మిగిలిన ఐదు స్థానాల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌లు బలపడినట్లు కనిపించడం లేదు. ఈ అయిదుచోట్ల టీడీపీకి లీడింగ్ రాలేదు. అనపర్తికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నిడదవోలుకు బూరుగుపల్లి శేషారావు, గోపాలాపురంలో ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజానగరంలో పెందుర్తి వెంకటేష్‌లు ఇన్‌చార్జ్‌లుగా ఉన్నారు. అటు కొవ్వూరులో జవహర్ పార్టీని చూసుకుంటున్నారు. అయినా సరే ఐదు స్థానాల్లో టీడీపీ బలపడలేదు.
ఇటీవల పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడింది. ఇక పరిషత్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్‌గా జరిగింది. అటు రాజమండ్రి పార్లమెంట్ ఇన్‌చార్జ్ మాగంటి రూప సైతం పార్టీలో యాక్టివ్‌గా లేరు. మొత్తానికైతే రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో టీడీపీకి అసలు లీడ్ రాలేదు.