రేవంత్ రెడ్డిపై పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు..?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై సొంత పార్టీకి చెందిన మాజీ ఎంపీ వి. హనుమంత రావు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి అనుచరులు తనను బెదిరించినట్టు వీహెచ్‌ అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లోనూ.. హైదరాబాద్ నగర సీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. ఇటీవల తాను ఓ చేసిన ఇంటర్వ్యూ కారణంగా ఇలా తనను బెదిరించారని మాజీ ఎంపీ వీహెచ్ ఆరోపిస్తున్నారు.


ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీ హనుమంతరావు.. రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. రేవంత్‌రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయని వీహెచ్‌ ఆ ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. ఇటీవలే రేవంత్ రెడ్డిపై నోటుకు ఓటు కేసులో చార్జ్‌షీటు కూడా దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీహెచ్ కొన్న వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వూ ప్రసారమైంది. ఆ తర్వాత.. ఆ ఇంటర్వ్యూ చూసిన రేవంత్ అనుచరులు వీహెచ్‌కు ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.


రేవంత్ రెడ్డిపై విమర్శలు మానుకోవాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రేవంత్ అనుచరులు తనను బెదిరించినట్టు వీహెచ్ చెబుతున్నారు. రేవంత్ అనుచరులు తనను బెదిరించడం ఇదే తొలిసారి కాదని.. గతంలోనూ తనను రెండు సార్లు రేవంత్ అనుచరులు బెదిరించారని వీహెచ్ తెలిపారు. పదే పదే తనను బెదిరిస్తున్న రేవంత్ అనుచరులపైనా.. వారిని ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని వీహెచ్ ఫిర్యాదులో తెలిపినట్టు సమాచారం.


ఏదేమైనా రేవంత్ రెడ్డిపై సొంత పార్టీకి చెందిన నాయకుడే ఫిర్యాదు చేయడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అసలు రేవంత్ కాంగ్రెస్‌లోకి రావడం ఆ పార్టీలోని సీనియర్ నాయకులకు ఇష్టం లేదన్న సంగతి తెలిసిందే. నోటుకు ఓటు వంటి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్‌ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి అగ్రస్థానం కట్టబెట్టడం వారికి నచ్చడం లేదు. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ఏ మలుపులు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: