చిక్కుల్లో పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి.. !

పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి రంగ‌స్వామి చిక్కుల్లో ప‌డ్డారు. సీఎం కుర్చీపై కూర్చ‌న్న ఆనందం కంటే ప్ర‌స్తుతం నెల‌కొన్న పరిస్థితుల‌తో ఆందోళ‌నే ఎక్కువయ్యింది. ముఖ్య‌మంత్రి  స‌భ‌లో బీజేపీ స‌భ్యుల బ‌లం పెర‌గ‌టంతో రంగ‌స్వామికి కొత్త త‌ల‌నొప్పులు వ‌చ్చి ప‌డ్డాయి. బీజేపీ త‌మ‌కు డిప్యూటీ ముఖ్య‌మంత్రి, డిప్యూటీ స్పీక‌ర్ మ‌రియు రెండు మంత్రి ప‌ద‌వులు కావాలంటూ ప‌ట్టుబడుతోంది. దాంతో పుదుచ్చేరిలో పొలిటిక‌ల్ హీట్ పెరింగింది. రాష్రంలో మొత్తం 30 నియోజ‌క వ‌ర్గాలుండ‌గా...ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌–10, బీజేపీ–6, డీఎంకే–6, కాంగ్రెస్‌–2, స్వతంత్ర అభ్య‌ర్థులు ఆరు స్థానాల్లో గెలుపొందారు. దాంతో బీజేపీ మరియు ఎన్ఆర్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఎన్ఆర్ కాంగ్రెస్ నుండి రంగస్వామి ముఖ్య‌మంత్రి పీఠాన్ని ద‌క్కించుకున్నారు. ఆ త‌ర‌వాత క‌రోనా బారిన‌ప‌డ్డ రంగ‌స్వామి ఇటీవ‌లే కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఎమ్మెల్యేల ప్ర‌మాణ స్వీకారం జ‌రిగింది. కాగా బీజేపీ నుండి ఆరుగురు ఎమ్మెల్యేలు గెల‌వగా మ‌రో ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేల‌తో క‌లిపి తొమ్మిదిమందికి చేరింది. 


అంతే కాకుండా మ‌రో ముగ్గురు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు కాషాయ పార్టీతో జ‌త‌కట్టారు. మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ నిర్మల్‌కుమార్, సీనియర్‌ నేత నమశ్శివాయంతో భేటీ అవ్వ‌డం, ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి ఆశీస్సులు అందుకోవడం చర్చకు దారి తీసింది. ఇక ఇప్పుడు బీజేపీ బలం ప‌న్నెండుకు చేర‌డంతో త‌మ‌కు డిప్యూటీ ముఖ్య‌మంత్రి మ‌రియు ఇత‌ర ప‌ద‌వులు కావాల‌న్న చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాబ‌ట్టి బీజేపీకి ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తే తాను నామ‌మాత్రం ముఖ్యమంత్రి అవుతార‌న్న ఆందోళ‌న రంగ‌స్వామిలో మొద‌లైంది. మ‌రోవైపు త‌న పార్టీ ఎన్ఆర్ కాంగ్రెస్ లోనూ కొంద‌రు ప‌ద‌వుల‌ను ఆశిస్తుండ‌టంతో రంగ‌స్వామికి కొత్త త‌ల‌నొప్పిగా మారింది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అంతే కాకుండా మిగిలిన‌ ముగ్గురు స్వ‌తంత్ర ఎమ్మెల్యేల‌ను మ‌రియు డీఎంకే ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: