ఈ మందులకు పేర్లు పెట్టిందెవడ్రా బాబో.. కేటీఆర్‌ కామెడీ ?

Chakravarthi Kalyan
మంత్రి కేటీఆర్.. టెక్నాలజీని బాగా వాడతారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన పర్సనల్ అకౌంట్లతో పాటు మంత్రిగా మరికొన్ని ఎకౌంట్లు కూడా ఉంటాయి. కేటీఆర్ టీమ్ వీటి అన్నింటిని పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా కరోనా సమయంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ ఫుల్ బిజీగా కనిపిస్తోంది. నిరంతరం ఎవరో ఒకరు ఏదో సాయం కోరుతూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఆయన టీమ్ వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటోంది. ఇలా కొన్ని రోజులుగా ఆయన ట్విట్టర్ అకౌంట్‌ కు ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది.

అయితే ఎప్పుడూ సీరియస్ అంశాలపై అంతే సీరియస్‌గా స్పందించే కేటీఆర్.. అప్పుడప్పుడు కాస్త సెటైర్లు కూడా వేస్తుంటారు. అసలే కోవిడ్ కాలం.. కరోనా బాధితులు విజ్ఞప్తులు ఆలకిస్తున్న కేటీఆర్ తాజాగా ఓ సెటైర్‌ వేశారు. అది ఎవరిమీదో తెలుసా.. కరోనా మందుల మీద. అవును.. రెమ్‌డెసివిర్, టోసిలిజుమాబ్‌..  కరోనా చికిత్స కోసం ఇప్పుడు అనేక మందులు వాడుతున్నారు. నిన్న మొన్నటి వరకూ అసలు వీటి పేర్లు కూడా ఎవరికీ తెలియదు. కానీ.. ఇప్పుడు అంతా తెలుసుకోవాల్సి వస్తోంది.
 
విచిత్రం ఏంటంటే.. ఈ మందులు పేర్లు చదవడం, చెప్పడం చాలా కష్టంగా ఉంటోంది. ఉదాహరణకు రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌, పోసోకోనజోల్‌, లిపోసోమాల్ ఆంపెటెరిసిన్, ఫ్లావిపిరవిర్, మోల్నుపిరవిర్, బారిసిటినిబ్.. ఇలా నోరు తిరిగని.. పలకడానికి కష్టంగా ఉన్న పేర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాపం.. కొన్నిరోజులుగా ఈ మందుల పేర్లు వినీవినీ కేటీఆర్ విసుగెత్తిపోయారో ఏమో కానీ.. కామెడీగా మందుల పేర్లపై ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తమాషాగా అడుగుతున్నా... నోరు తిరగని మందుల పేర్లన్నీ ఓ జాబితాగా రాసి.. మందులకు ఇలా నోరు తిరగని పేర్లు పెట్టిందెవరో తెలుసా.. అంటూ  ఓ పోస్టు పెట్టారు.

ఆ తర్వాత తన ప్రశ్నకు తానే సమాధానమిస్తూ ఓ సెటైర్ పేల్చారు. బహుశా ఇలాంటి నోరు తిరగని పేర్ల వెనుక  కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ హస్తం ఉందేమో అంటూ హాస్యమాడారు. శశిథరూర్‌ ను ఇంగ్లీష్ మేధావిగా అంతా చెబుతుంటారు. అందుకే కేటీఆర్ ఆయన్ను ఇందులోకి లాగి జోక్‌ పేల్చారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: