రఘురామ: నడవలేకపోయాడు.. చంపేద్దామనుకున్నారట..?

Chakravarthi Kalyan
ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ మళ్లీ హైదరాబాద్‌కు చేరింది. ఆయనకు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు నిన్న ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకే ఎంపీ రఘురామకృష్ణంరాజును  రాత్రి 11 గంటల సమయంలో సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ ఆస్పత్రి వద్ద చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్‌పోస్ట్‌ వద్ద ఎస్కార్ట్‌ వాహనం దిగిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు మిలిటరీ అంబులెన్స్‌లో ఎక్కే సమయంలో నడవలేక పోయారు. అడుగు తీసి అడుగు వేసేందుకు ఆయన ఇబ్బంది పడినట్టు కనిపించింది.

నడవలేకపోయిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు అక్కడే  కొద్దిసేపు కూర్చుండి పోయారు. ఆర్మీ సిబ్బంది సాయంతో ఆయన  అంబులెన్స్‌ ఎక్కారు. ఎంపీ రాక విషయం ముందుగానే తెలియడంతో సికింద్రాబాద్ మిలిటరీ ఆస్పత్రికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు చేరుకొన్నారు. సీఐడీ అధికారుల అనుమతితో వారు ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. న్యాయం గెలుస్తుంది.. ధైర్యంగా ఉండండంటూ ఈ సమయంలో కుటుంబ సభ్యులకు రఘురామ చెప్పినట్టు తెలిసింది. ఏపీ నుంచి వచ్చిన ఎంపీ అభిమానులు ఆర్మీ ఆస్పత్రి వద్దకు చేరుకొని నినాదాలు చేశారు.

ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరలింపు విషయాన్ని కవర్ చేసేందుకు పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు రాత్రి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్నారు. మీడియాతో రఘురామ మాట్లాడే ప్రయత్నం చేసినా అధికారులు అనుమతించలేదు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాత్రం ఏపీలో తనను చంపేద్దామనుకున్నారని  అన్నారు.  తనకు ప్రాణహాని ఉందని మీడియాకు తెలిపారు.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణ  హైకోర్టు జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో ఆర్మీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యనిపుణుల బృందం ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహిస్తుంది. ఈ మేరకు  ఆర్మీ అధికారులు సోమవారం రాత్రి ఓప్రకటన విడుదల చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు చేస్తున్న సమయంలో వీడియో తీసి కోర్టుకు సమర్పిస్తారు. ఆర్మీ ఆస్పత్రి ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: