అంతరిక్షం పై పెత్తనం చెలాయించేందుకు చైనా వడివడిగా అడుగులు వేస్తోంది. కొద్ది రోజుల క్రితం తన సొంత స్పేస్ స్టేషన్ కోసం ఓ కోర్ మాడ్యూల్‌ని రోదసిలో ప్రవేశపెట్టిన చైనా 6 నెలల క్రితం చంద్రుడి ఉపరితలం నుంచి 2 కేజీల రాళ్లను భూమి మీదకు తెచ్చి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అంతే కాదు ఈ ఏడాది జూన్ నెలలో ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా అంతరిక్షంలో మరొక చరిత్ర సృష్టించి ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేస్తోంది.
చైనా విజయవంతంగా అంగారక గ్రహంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసినట్టు చైనీస్ మీడియా శనివారం ఉదయం ప్రకటించింది. 3 నెలల క్రితం నాసా ‘పర్సెవరెన్స్’ రోవర్ ని అంగారక గ్రహంపై విజయవంతంగా లాండ్ చేయగలిగింది. ఆ తర్వాత చైనా జాతీయ అంతరిక్ష పరిపాలన విభాగం (సిఎన్‌ఎస్‌ఎ) అంగారక గ్రహంపై "ఝురోంగ్ రోవర్" ని దింపి చరిత్ర సృష్టించింది. అంగారక గ్రహం పై అడుగుపెట్టిన రెండవ రోవర్ గా చైనీస్ "ఝురోంగ్ రోవర్" చరిత్ర లిఖించింది.
నిజానికి అంగారక గ్రహంపై వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ వాతావరణంలోకి ప్రవేశించలేక ఇతర దేశాల రోవర్స్ పేలిపోయాయి. కొన్ని రోవర్స్ మార్స్ ఉపరితలం వద్దకు వెళ్ళగానే అంతుచిక్కకుండా మాయమైపోయాయి. అయితే చైనా రోవర్ మాత్రం 7 నిమిషాల భయంకర జర్నీని పేరాచూట్ సహాయంతో దాటి మార్స్ ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఐతే ఈ రోవర్ మార్స్ పై యుటోపియా ప్లానిటియా అని పిలువబడే విస్తారమైన ఉత్తర లావా మైదానాన్ని ల్యాండింగ్ కి లక్ష్యంగా ఎంచుకుంది. ఆరు చక్రాలతో సుమారు 240 కిలోగ్రాముల బరువు ఉండే ఈ చైనా రోవర్ సౌరశక్తితో పనిచేస్తుంది. ఈ రోవర్ అంగారక ఉపరితలం పై ఉన్న రాతి నమూనాలను సేకరించి విశ్లేషించనుంది.
ఒకవైపు ప్రపంచం కరోనాతో పెద్ద యుద్ధమే చేస్తుంటే.. ఆ వైరస్ సృష్టికి కారణమైన చైనా మాత్రం ఎంచక్కా అంతరిక్షంలో పరిశోధనలు, ప్రయోగాలు చేస్తోంది. స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసి 2022 నాటికి చంద్రుడు మీదకు మనసులను పంపాలని కూడా బలంగా ఆశిస్తోంది.