మోడీ అనుకున్నది ఒకటైతే... ?

Satya
సరిగ్గా రెండు నెలల క్రితం చూస్తే దేశంలో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రపంచం కూడా భారత్ విషయంలో ఒక ఆశావహ భావనతో చూసేది. మోడీ లాంటి బలమైన ప్రధాని ఏలుబడిలో ఈ దేశం ఉందని కూడా ప్రతీ పౌరుడు అనుకునే వాతావరణం ఉండేది.
ఇక మోడీకి కూడా అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు లభించాయి. ఒక్క మాట చెప్పుకోవాలంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తరువాత మోడీ అంతర్జాతీయంగా తనదైన ముద్ర బలంగా వేశారు. అంతే కాదు ఆయన ప్రధానిగా తిరిగినన్ని దేశాలూ ఎవరూ తిరగలేదు అని కూడా చెప్పవచ్చు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తమ ప్రచారానికి మోడీని అమెరికా పిలిపించుకున్నాడు అంటనే నాడు మోడీ ప్రభ ఎలా వెలిగిపోయిందో అర్ధమవుతోంది.
సీన్ కట్ చేస్తే ఇపుడు జీ 7 దేశాల మీటింగ్ జూన్ లో జరుగుతూంటే మోడీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. దానికి కారణం దేశంలో బాగా ఉధృతం అవుతున్న కరోనా. ఈ మహమ్మారితో ప్రపంచం ఈనాడు భారత్ ని ఏదోలా చూస్తోంది.  కరోనా పుట్టిన చైనా కంటే కూడా దారుణంగా భారత్ పరిస్థితి తయారైంది. అయితే ఇక్కడ మోడీ వేసుకున్న కొన్ని అంచనాలు తప్పు కావడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు.
కరోనా రెండవ దశ ముప్పు భారత్ కి ఉండదు అని గట్టిగా భావించారు. భారతీయుల రోగ నిరోధక శక్తి మీద కూడా నమ్మకం ఉండేది. ఇక చలి దేశాలకు మాత్రమే ఈ వైరస్ పీడ ఎక్కువగా ఉంటుందని కూడా ఊహించారు. పైగా వేసవి వచ్చేసినందువల్ల భారత్ కి రెండవ దశ తాకినా పెద్దగా ఇబ్బంది ఉండదు అనుకున్నారు. కానీ అదంతా తప్పు అని తేలింది. దాని ఫలితమే ఇపుడు దేశమంతా పాకేసిన కరోనా. దేశంలో కరోనా ప్రభావం పెద్దగా ఉండదన్న ధైర్యంతోనే మోడీ ఇతర దేశాలకు కరోనా టీకాలను పంపించారు. కానీ కేవలం రెండు నెలల తేడాతో అవే దేశాల నుంచి భారత్ సాయాన్ని కోరవలసి వచ్చింది. ఏది ఏమైనా రెండవ దశ ఇలా భీకర రూపం దాల్చడంతోనే మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: