జగమొండి జగన్... కోర్టు హెచ్చరికతో తగ్గత తప్పలేదుగా..?

Chakravarthi Kalyan
జగన్.. జగమొండి.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. ఒక్కసారి తాను ఏదైనా అంశంపై ఫిక్స్ అయ్యాడంటే.. ఆ తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా.. వెనక్కి తగ్గే ఆలోచనే చేయడు. అది తన నైజం. అది కొన్నిసార్లు మంచి చేయొచ్చు.. ఇంకొన్ని సార్లు చెడు చేయొచ్చు.. కానీ.. తన తీరు అంతే.. పర్యవసనాలు ఎలా ఉన్నా సరే.. తాను పెద్దగా పట్టించుకోడు.. ఇప్పుడు ఏపీలో పరీక్షల విషయంలోనూ జగన్ అదే మొండి వైఖరి ప్రదర్శించాడు.

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేస్తే.. జగన్ మాత్రం అబ్బే వాయిదా వేసే ప్రసక్తే లేదు.. అని తేల్చే చెప్పేశాడు. అలా చేస్తే విద్యార్థులకే నష్టం అని వాదించారు. ఎందరు విమర్శించినా పట్టించుకోలేదు.. అసలు ప్రాణం ఉంటే కదా.. చదువుకోవడానికి అంటూ చంద్రబాబు విమర్శించినా కేర్ చేయలేదు. కానీ.. చివరకు జగమొండి జగన్.. హైకోర్టు కామెంట్లతో తగ్గక తప్పలేదు.

మీరు రద్దు చేస్తారా.. మమ్మల్ని చేయమంటారా అంటూ హైకోర్టు ఉరిమేసరికి... చేసేది లేక పరీక్షలను వాయిదా వేశారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో ఓ పత్రికా ప్రకటన ఇప్పించారు. ఇంటర్‌ మీడియట్‌ పరీక్షల నిర్వహణమీద పునరాలోచన చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని మంత్రి ప్రకటన విడుదలు చేశారు.

ఇంటర్‌ మార్కుల్ని పరిగణనలోకి తీసుకున్న ప్రతి సందర్భంలోనూ పరీక్ష రాసి మంచి మార్కులతో, ర్యాంకులతో సర్టిఫికెట్‌ కలిగి ఉన్నవారికి మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయని.. ఈ మార్కులే వారి పైచదువులు, ఉద్యోగావకాశాల పరంగా కీలకం అవుతాయి కాబట్టే... ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలోని మన విద్యార్థి వెనకబడకుండా చూడాల్సిన బాధ్యత ఒక మంచి ప్రభుత్వంగా మన మీద ఉంది కాబట్టే... వారి పరీక్షల నిర్వహణకు మనందరి ప్రభుత్వం ఇంతగా తాపత్రయపడిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు, ఇందుకు సంబంధించిన వార్తల పట్ల పరీక్ష రాయాల్సిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ప్రజాప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకుని పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: