ఖమ్మం, వరంగల్ ఎన్నికలు రద్దు...?

Gullapally Rajesh
తెలంగాణాలో కరోనా కేసులు ఆగడం లేదు. కరోనా కేసుల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తున్నా సరే ఫలితం మాత్రం పెద్దగా కనపడటం లేదు. ఇక కరోనా కేసులకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాదాపుగా బిజెపి నేతలు అందరికి కరోనా సోకింది. దీనిపై కేంద్ర నాయకత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది.
కొందరు క్వారంటైన్ లో కూడా ఉంటున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి రెండో సారి కరోనా వచ్చింది అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని గవర్నర్ కు ఈమెయిల్ ద్వారా లేఖను బీజేపీ నేత లక్ష్మణ్ పంపించారు. ఎన్నికలపై ఉన్న సోయి.. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలపై లేదని అన్నారు. మినీ మున్సిపల్ ఎన్నికలను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. ఎన్నికలు వాయిదా అవసరం లేదని ప్రభుత్వం చెప్పటం బాధ్యతారాహిత్యం అన్నారు ఆయన.
తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి అని సూచించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ నామమంత్రంగా మారాడు అని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. కరోనా కట్టడికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామన్న ముఖ్యమంత్రి  మాటలు బూటకం అన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ లో  తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. కరోనా చికిత్స‌ను వెంటనే ఆరోగ్యశ్రీ లో చేర్చాలి అని ఆయన కోరారు. దోపిడీ చేస్తోన్న ప్రైవేటు ఆసుపత్రులను కట్టడి చేయటంలో ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు.  కరోనా సోకిన 20శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవటానికి సౌకర్యాలుండటం చేతకాని తనమే అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: