ఆ ఇద్దరు మేధావులను తెలంగాణ యువత ఎందుకు తిరస్కరించారు..?

Chakravarthi Kalyan
ఇటీవల తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లను టీఆర్ఎస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. వరంగల్ ఖమ్మం నల్గొండ సీట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి.. హైదరాబాద్‌ రంగారెడ్డి మహబూబ్‌నగర్ స్థానంలో వాణిదేవి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ఇద్దరు మేధావులు పరాజయం పాలవడం ఆలోచింపజేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇద్దరు ఫ్రొఫెసర్లు కోదండరామ్, నాగేశ్వర్ ఇద్దరూ మూడోస్థానంలోనే నిలిచారు.


ఈ ఇద్దరు మేధావులు ఏ దశలోనూ రెండో స్థానానికి రాలేకపోయారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో 93 మంది పోటీకి చేయగా.. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ల నియోజకవర్గంలో 70 మందికి పైగా పోటీ చేశారు. హైదరబాద్ లో ఫ్రొఫెసర్ నాగేశ్వర్ బీజేపీ నేత రామచంద్రరావు కంటే వెనుకబడిపోయారు. ఆయన గతంలో రెండు సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.


ఇక అలాగే నల్గొండ లో ప్రొఫెసర్ కోదండరామ్ కూడా మూడో స్థానానికే పరిమితం అయ్యారు.
ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. ఆయన ఇప్పుడు స్వయంగా ఎమ్మెల్సీ బరిలో దిగి పరాజయం పాలయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కోదండరామ్‌ కంటే యువకులు తీన్మార్ మల్లన్ననే ఆదరించారు. పల్లా మొదటి స్థానంలో నిలవగా.. తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. కోదండరామ్ మూడో స్థానంలో ఉండాల్సి వచ్చింది.


ఈ మేధావుల పరాజయానికి ప్రధాన కారణం.. దూకుడు లేకపోవడం గానే కనిపిస్తోంది. అలాగే యువత ఓట్లు భారీగా పెరగడం.. వారు అటు అధికార పార్టీ ప్రలోభాలకో లేక.. తీన్మార్ మల్లన్న వంటి దూకుడు ఉన్న నేతలవైపో ఆకర్షితులవుతున్నారు తప్ప మేధావుల వైపు కాదని తెలుస్తోంది.  అయితే మరి ఈ మేధావుల రాజకీయాలకు కాలం చెల్లిందని భావించొచ్చా అంటే అప్పుడే చెప్పలేం. కేవలం సిద్ధాంతబలమే కాకుండా.. జనంలోకి కూడా దూసుకెళ్లాల్సిన లక్షణం ఈనాటి రాజకీయాలకు అత్యవసరమని ఈ ఎన్నికలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: