విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి ఆత్మాహుతి కేసులో అదిరిపోయే ట్విస్ట్‌..?

Chakravarthi Kalyan
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా స్టీల్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి ఆత్మాహుతి చేసుకుంటానంటూ రాసిన లేఖ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 32 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, తాను 33వ వ్యక్తిగా నిలుస్తానని ఆయన తన లేఖలో  ప్రకటించాడు. ఆ మేరకు స్టీల్‌ ప్లాంట్ డ్యూటీ లాక్ బుక్‌లో సూసైడ్ నోట్ కూడా రాశాడు. స్టీల్‌ ప్లాంట్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆత్మాహుతి చేసుకుంటానంటూ స్టీల్ ప్లాంట్ డ్యూటీ లాక్ బుక్‌లో సూసైడ్ నోట్‌ను రాశాడు.


‘ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరుగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిని ప్రైవేటు పరం కానివ్వొద్దు. నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. నేను స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగం చేసిన 33వ వ్యక్తిగా నిలుస్తాను. ఈ రోజు సాయంత్రం 5.49 నిమిషాలకు స్టీల్ ప్లాంట్‌లోని ఫర్నెస్‌లో ఆహుతి అవుతాను. ఈ పోరాటం నా ప్రాణత్యాగంతో మరింత ఉధృతం కావాలి  అని టెక్నీషియన్ శ్రీనివాస్ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.


ఈ ఆత్మాహుతి లేఖ కలకలం రేపింది..అయితే ఈ ఉద్యోగి గురించి విచారణ నిర్వహించిన పోలీసులు అదిరిపోయే విషయం బయటపెట్టారు. అదేంటంటే.. శ్రీనివాసరావు.. ఉద్యోగాల పేరుతో ఇద్దరి వద్ద రూ.50 లక్షలు వసూలు చేశాడట. శనివారం ఉదయం ఉద్యోగాల ప్రకటన వస్తుందని నమ్మించాడట. అంతే కాదు.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరో 16 మందిని నమ్మించాడట. ఆ విషయం నుంచి పక్కదోవ పట్టించేందుకు ఇలా ఆత్మాహుతి డ్రామా ఆడాడని పోలీసులు చెబుతున్నారు.


శ్రీనివాసరావు ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నాడని.. ఆత్మహత్య చేసుకుంటానని ప్లాంట్‌ లాగ్‌బుక్‌లో రాశాడని చెబుతున్న పోలీసులు.. బ్లాస్ట్ ఫర్నేస్‌లో పడి చనిపోవడం అసాధ్యమని అంటున్నారు. స్టీల్‌ ప్లాంట్‌లో ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదని ఏసీపీ పెంటారావు తెలిపారు. శ్రీనివాసరావు ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: