ఆ విషయంలో జగన్ ముందు.. జగన్ తర్వాత అనుకోవాల్సిందే..

Deekshitha Reddy
నాడు-నేడు అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్ ని పూర్తి స్థాయిలో ఆధునీకరించే ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం. నిధులు సక్రమంగా వినియోగం అవుతున్నాయా, లేవా అనే విషయం పక్కనపెడితే ఈ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మాత్రం మారిపోతున్నాయి. ఇప్పుడు వైద్యరంగంలో కూడా నాడు-నేడు పథకం పూర్తి స్థాయిలో అమలవుతోంది. ఇది పూర్తయితే ప్రభుత్వ ఆస్పత్రులన్నీ కార్పొరేట్ లుక్ సంతరించుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాష్ట్రంలో పేదల వైద్యానికి మంచి రోజులు మొదలయ్యాయనే చెప్పుకోవాలి. అన్ని జిల్లాల్లోని వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులను పకడ్బందీగా తీర్చిదిద్దడానికి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం రూ. 1,223 కోట్ల అంచనా వ్యయంతో కొన్ని చోట్ల కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. మరికొన్ని చోట్ల పాతవాటికే రిపేర్లు చేస్తున్నారు. రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లోనే ఎక్కువగా ఔట్ ‌పేషంటు సేవలు, ఇన్ ‌పేషంటు సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఏడాదికి 2.30 కోట్ల మంది వైద్యం అందుకుంటున్నారు. అందుకే అలాంటి ఆస్పత్రులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు, సౌకర్యాలు పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని అమలులోకి తెచ్చింది.
వైద్య రంగంలో నాడు-నేడు కింద ప్రభుత్వం చేపట్టిన మొత్తం 165 పనులను 2022 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని చోట్ల కొత్త నిర్మాణాలు పిల్లర్ల దశలో ఉండగా, కొన్నిచోట్ల మొదటి అంతస్తు కూడా పూర్తయింది. కడప, నెల్లూరు, కృష్ణా, జిల్లాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని అంటున్నారు అధికారులు. నాబార్డ్ రుణంతో ఈ పనులు మొదలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు నిర్మించడంతోనే ప్రభుత్వం పని పూర్తి కాలేదని, వాటికి తగ్గట్టుగానే వైద్యులను నియమించి, అధునాతన సౌకర్యాలతో వైద్య సేవలు అందిస్తామని చెబుతున్నారు అధికారులు.
ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి వైెస్ఆర్ ఎలా చిరస్థాయిగా నిలిచిపోయారో.. ఇప్పుడు నాడు-నేడు అనే కార్యక్రమం ద్వారా వైద్యరంగంలో పెనుమార్పు తీసుకొచ్చి జగన్, అలా చిరస్థాయిగా నిలిచిపోతారని అంటున్నారు వైసీపీ నేతలు. వైద్య రంగంలో సౌకర్యాల కల్పనలో జగన్ ముందు, జగన్ తర్వాత అనుకునేలా మార్పులుంటాయని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: