టీచర్ల కష్టాలు: నల్లబల్లపై కష్టాల పాఠం.. అర్థాకలితో గురువుల పోరాటం..!

Chakravarthi Kalyan
వాళ్లు.. విద్యావ్యవస్థలో కీలక పాత్ర వహిస్తారు.. సమాజంలో సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులకు పాఠాలు చెబుతారు.. విద్యాబుద్దులు చెప్పి ఓ దారిన పెడతారు. విద్యారంగం నుంచి ప్రభుత్వం సాధ్యమైనంతగా తప్పుకుంటున్న సమయంలో వీరి చేతుల మీదుగానే నవ పౌరులు రూపుదిద్దుకుంటారు. కానీ ఇప్పుడు వారు రోజూ పాఠాలు చెప్పే నల్లబల్ల భోరుమంటోంది. తమ గురువుల దుస్థితి చూసి వెక్కివెక్కి ఏడుస్తోంది.

నెలల తరబడి జీతాల్లేవు.. ఎప్పుడు ఇస్తారో లేదో తెలియదు.. ఇచ్చినా అరకొరే.. దాదాపు ఏడాదిగా ఇదే పరిస్థితి. కొందరు ఆర్థిక ఇబ్బందులతో చదువులు చెప్పిన చేతులతోనే కూలీ నాలికి వెళ్లారు. కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లు, కడుపున పుట్టిన వాళ్లను పస్తులు పెట్టలేక.. ఏ పనైనా చేసేందుకు సిద్ధపడ్డారు. దాదాపు ఏడాదిగా జీతాల్లేక, ఎట్లా బతకాల్నో తెలియక సుమారు రెండు లక్షల మంది టీచర్లు దిక్కుతోచకుండా ఉన్నారు. ఇంటి అద్దెలు..  ఈఎంఐలు, అసలు నిత్యావసరాలకే డబ్బుల్లేక.. దొరికిన కాడ అప్పులు చేస్తున్నారు. చివరికి ఇంట్లో ఉన్న అంతో ఇంతో బంగారాన్ని కూడా అమ్ముకుంటున్నారు.

పొలాలు, జాగాలు అమ్ముకుంటున్నవారు కొందరు. ఈఎంఐలు కట్టలేక బైకులు కూడా అమ్మేసుకుంటున్న వారు ఇంకొందరు.. దాదాపు 80 శాతానికిపైగా ప్రైవేటు టీచర్లది ఇదే దుస్థితి. వీరిలో 90 శాతం మంది టీచర్లు కనీసం ఐదారు నెలల అద్దెలు బాకీ ఉన్నారు. వీరిలో చాలా మంది టీచర్లు నిత్యావసరాలు కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారు. ఇవేవో గాలి కబుర్లు కావు.. తాజాగా భారత్ దేఖో అనే యూత్ ఆర్గనైజేషన్ ఇటీవల ప్రైవేట్ స్కూళ్ల’లో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితులపై చేసిన సర్వేలో  వివరాలు ఇవి. చిన్న ప్రైవేటు స్కూళ్ల  టీచర్ల పరిస్థితి రోజురోజుకు దీనంగా మారిపోతోంది. ఇకనైనా  ఈ గురువుల గోడు పట్టించుకోవాలి.. విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, టీచర్లకు జీతాలివ్వాల్సిందిగా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను ఆదేశించాలి. ఇదీ ప్రైవేటు టీచర్ల కోరికలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: