భారత్ పై ప్రపంచ శక్తుల కుట్ర..? రహస్యం బయటపెట్టిన మోడీ..!?
అంతే కాదు.. ఇప్పుడు బీజేపీ కూడా అంతర్జాతీయ సెలబ్రెటీలపై విరుచుకుపడటం మొత్తం మీద ఇండియా పరువు పోయే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు.. సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ చేసిన పోస్టులో ప్రస్తావించిన టూల్ కిట్‌పై దిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. భారత్‌పై ప్రపంచ శక్తులు కుట్రపన్నాయంటున్నారు ప్రధాని మోడీ. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విమర్శలు చేశారు.
దేశ ప్రతిష్ఠను మసకబార్చేందుకు ప్రపంచశక్తులు కొన్ని కొద్ది రోజులుగా కుట్రలు చేస్తున్నాయన్నారు మోడీ.. ఈ కుట్రలను దేశప్రజలతో కలిసి సమర్థంగా తిప్పికొడతామని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు. అంతే కాదు.. ఈ కుట్రలపై దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉంటున్న మమతాబెనర్జీ సహా ఇతర నేతలు నోరు మెదపడం లేదని విమర్శించారు. అసలు ఇలాంటి వారి తీరు చూస్తే. వారు ఆ కుట్రలను సమర్థిస్తున్నారనే అనుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోడీ ఘాటుగా విమర్శించారు.
అసలే బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా.. అందుకే ప్రధాని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శల డోసు మరికాస్త పెంచారు. బెంగాల్ ప్రజలు మమత నుంచి మమతను కోరుకుంటే ఆమె మాత్రం క్రూరత్వాన్నే వారికి చూపారని కామెంట్ చేశారు. అభివృద్ధికి అడ్డు తగిలి బెంగాల్ యువత భవిష్యత్‌ను నాశనం చేశారని చివరకు భారత్ మాతాకీ జై అనే నినాదం కూడా మమతకు నచ్చకుండా పోయిందని మోదీ కామెంట్ చేశారు.