అధికారం కోసం అధినేతలు బరిలోకి దిగుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు వందలాది కిలోమీటర్లు పరుగులు పెడుతున్నారు. ఓట్లకోసం నేతల నాటకాలు మొదలయ్యాయి. యాత్రలతో తమ ఓటుబ్యాంకును పదిలం చేసుకునేందుకు ఆరాట పడుతున్నారు. రాష్ట్రంలో పోటాపోటీగా యాత్రలు సా..గుతూనే వున్నాయి. బోసిపోయిన ఊర్లలో బడానేతలు బహిరంగ సభలు పెడుతున్నారు. సాధ్యాఅసాధ్యాలను పక్కన పెట్టి నోటికి హద్దు అదుపు లేకుండా హామీల గుప్పిస్తూనే ఉన్నారు. కరువు గ్రామాల్లో ఓట్లు దండుకునేందుకు నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రజల మనస్సుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్. వైఎస్ఆర్ బరిలోకి లాగుతున్నారు. రామరాజ్యం కావాలా...రాజన్న రాజ్యం కావాల అంటూ ప్రజలకు పరీక్ష పెడుతున్నారు.
రామరాజ్యం తిరిగి తెద్దాం. ప్రజలకు సుభీక్షమైన పాలన రామరాజ్యంలోనే సాధ్యం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడదామంటూ తెలుగుతమ్ముళ్ళు తెగ తిరిగేస్తున్నారు. పాదయాత్ర పేరిట తెలుగుదేశం అధినేత 16 రోజులుగా ఓటు వేట సాగిస్తూనే ఉన్నారు. అలాగే తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల సైతం పాదయాత్రకు సిద్దమైంది. రాజన్న రాజ్యం కోసం అంటూ ప్రజల్లోకి వెళ్లనుంది. నిరుపేదల గుండెల్లో గూడుకట్టుకున్న రాజన్న రాజ్యం తిరిగి రావాలంటే వైకాపాను ఆదరించాలని ఆమె పిలుపునిస్తోంది.
వినూత్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న వైఎస్ మరణంలో కుట్ర దాగుందంటూ ప్రచారం చేపట్టనుంది. మహానేత వైఎస్ ఆశయాల కోసమే రాజకీయాల్లోకి వచ్చనంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు వైకాపా వర్గంలో వ్యూహరచన సాగుతోంది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు యాత్ర సాగించిన ప్రాంతంలో తెలుగుదేశానికి సానుభూతి రాకుండా కొత్తహామీలతో తమవైపు తిప్పుకునేందుకు పథకరచన జరుగుతోంది. ఈనేపథ్యంలో బాబు యాత్ర చేసిన చోట ఇచ్చిన హామీలు ఏంటి? అందుకు భిన్నంగా వైకాపా తరుపున షర్మిల ఇవ్వవలసి హామీలేంటిన్న కోణంలో ఆలోచించేందుకు యువనేత జగన్ ఉద్దండులైన కొందరిని ఓ బ్రుందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
తాము చంద్రబాబు వెనక వెళ్లడం లేదని. లేనిపోని హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నందుకు ఆయన్ను వెంటాడుతున్నామని వైకాపా నేతలు వెల్లడిస్తున్నారు. వైఎస్ పాదయాత్రను కాపీ కొట్టి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బాబు కలలను నిర్వీర్యం చేస్తామని వైకాపా నేతలు బహిరంగంగా తేల్చిచెబుతున్నారు. అందుకే ఇడుపులపాయ టు ఇచ్చాపురం వరకు రాజన్న రాజ్యం కోసం అంటూ యాత్ర చేస్తున్నట్లు తెలియకనే తెలుస్తోంది.
వైకాపా నేతల్లో ముఖ్యంగా షర్మిల హావభావాలు ప్రజలను ఆకట్టుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా కాంగీయులు సైతం ఇందిరమ్మ బాటతో ఓటు యాత్ర చేస్తున్నారని చెప్పకతప్పదు. అయితే పార్టీలో నేతల మధ్య సఖ్యతలేని కారణంగా ప్రజలను ఆకట్టుకోలేకపోతోందన్నది తెలిసిందే. ఈక్రమంలో అనతికాలంలో జరిగే స్థానిక ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ పడుతూనే వున్నాయి. తమదైన శైలిలో పాదయాత్రలు చేపడుతూనే వున్నాయి.
అయితే మరో ఏడాదిలో జరుగబోవు ఎన్నికల్లోానున్నది ఇందిరమ్మ రాజ్యమా..రామన్న రాజ్యమా..రాజన్న రాజ్యమా అన్నది బ్యాలెట్ బాక్సులు బద్దలు కొడతేకాని తెలియవు. దివంగత నేతల పేరుతో దిగజార్చే రాజకీయాలు రాష్ట్రాన్ని ఏ దిశకు చేరుస్తాయన్నది వేచిచూడాల్సిందే.
మరింత సమాచారం తెలుసుకోండి: