బాబోయ్.. ఐస్ క్రీమ్‌లోనూ కరోనా ఉంటుందా..?
ఇందుకు కారణం.. తాజాగా.. చైనాలోని ఓ చోట ఐస్ క్రీమ్‌లోనూ కరోనా ఆనవాళ్లు కనిపించడమే. చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న వేళ అక్కడ తయారైన ఐస్‌క్రీంలోనూ కరోనా ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. బీజింగ్‌కు సమీపాన ఉన్న తియాన్జిన్ లోని డాకియావొడావో ఫుడ్ కంపెనీ లిమిటెడ్‌లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా ఆ బ్యాచ్‌లో ఉత్పత్తయిన వేల ఐస్ క్రీం కార్టన్‌లను సంస్థ వెనక్కి తీసుకుంటోంది. ఈ బ్యాచ్‌లో మొత్తం 29 వేల కార్టన్లు ఇంకా విక్రయించలేదని స్థానిక ప్రభుత్వాధికారులు తెలిపారు.
మొత్తం 390 కార్టన్లు తియాన్జిన్‌లో అమ్మినట్లు అధికారులు వెల్లడించారు. వీటి అమ్మకాలు ఎక్కడెక్కడ జరిగాయో కనిపెట్టే పనిలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఐస్‌క్రీం తయారీలో న్యూజిలాండ్, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలు ఉపయోగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఐస్‌క్రీంల వల్ల ఎవరైనా కరోనా బారినపడ్డారా అనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి అధికారులు ఆ సంస్థను సీజ్ చేశారు. అంతే కాదు.. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే ఎక్కడో చైనాలో జరిగిన సంగతే అయినా.. ఇలాంటి ఘటనలో ఇండియాలోనూ జరగకూడదని రూలేమీ లేదు కదా.. అందుకే.. ఆహార పదార్ధాల విషయంలోనూ జనంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే కరోనా జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి వాటి నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. సాధ్యమైనంత వరకూ బయటి ఫుడ్ జోలికి వెళ్లకపోవడం శ్రేయస్కరం.. ఏమంటారు..?