పరిటాల ఫ్యామిలీని టార్గెట్ చేసిన మాధవ్...రియాక్షన్‌లో తేడా వచ్చిందిగా...!
అయితే మాధవ్ వ్యవహారశైలి మొదట నుంచి కాస్త భిన్నంగానే ఉంది. కియాలో కార్లు ప్రారంభమైనప్పుడు, పార్లమెంట్‌లో మాధవ్ వ్యవహారం కాస్తంత భిన్నంగానే ఉంది. ఇక అదే మాధవ్ ఇప్పుడు దివంగత పరిటాల రవీంద్రపై సంచలన వ్యాఖ్యలు చేసి, హాట్ టాపిక్ అయ్యారు. గతంలో నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో పరిటాల రవి ఎంతో మంది తలలు నరికారని, చంద్రబాబు సహకారంతో ఎమ్మెల్యేగా ఇలాంటి పనులు చేశారని, రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీరు లేక ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపు టేర్లతో పొలాలను తడిపారని, పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిది అని మాధవ్ మాట్లాడారు.
ఇక మాధవ్ ఇలా మాట్లాడటంతో పరిటాల వర్గం నుంచి కూడా ఘాటు వ్యాఖ్యలే వస్తున్నాయి. ఇదే సమయంలో పరిటాల రవి భార్య, మాజీ మంత్రి పరిటాల సునీత నుంచి ఊహించని రియాక్షన్ వచ్చింది. మాధవ్ చరిత్ర తమకు తెలుసని, ఆయనలా రోడ్డెక్కి మాట్లాడి తమ విలువ తగ్గించుకోలేమని సునీత ఘాటుగానే మాట్లాడారు. మరోసారి పరిటాల రవి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని, అసలు పరిటాల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రశాంతంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇలా అనంతలో మాధవ్, పరిటాల ఫ్యామిలీల మధ్య చిన్నపాటి వార్ మొదలైంది. మరి ఈ వార్ ఎంతవరకు వెళుతుందో చూడాలి. మొత్తానికైతే మాధవ్ ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు.