గ్రేటర్ యుద్ధం : కేసీఆర్ కి కాషాయ భయం నిజమేనా..?

Deekshitha Reddy
దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ కి కాషాయ భయం పట్టుకుందని, అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, పోలీసుల్ని అడ్డంపెట్టుకుని దౌర్జన్యాలకు దిగారని మరోసారి మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. బీజేపీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కాషాయం ధరించే వారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారని సంజయ్‌ మండిపడ్డారు. కేసీఆర్‌కు కాషాయం భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

ప్రభుత్వం, ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని.. అధికారులు పాలకులకు కొమ్ముకాయడం సరికాదని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు సైతం అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి కనీసం సీపీఐ, సీపీఎం గుర్తులూ తెలియడంలేదని అన్నారు. ఎల్బీనగర్‌ పరిధి చైతన్యపురి డివిజన్ బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణలో గాయపడ్డ పార్టీ అభ్యర్థి నర్సింహగుప్తాను, సనత్‌నగర్‌లోని సుందర్‌నగర్‌ కాలనీలో పోలీసు ఇన్‌స్పెక్టర్‌ చేత లాఠీ దెబ్బలు తిన్న ప్రవాస భారతీయుడు మల్లేశం ను సంజయ్‌ పరామర్శించారు.

బీజేపీ నేతల తప్పు ఏమీ లేకపోయినా కావాలనే వారిపై కక్ష తీర్చుకుంటున్నారని మండిపడ్డారు సంజయ్. చైతన్యపురిలో ఓ పార్టీ నేతలు మద్యం పంచుతున్నారని సమాచారం ఇచ్చినా కూడా బీజేపీ కార్యకర్తలపైనే పోలీసులు లాఠీఛార్జీ చేశారని ఆరోపించారు. పాతబస్తీలో ఎంఐఎం నేతలు పోలింగ్‌ కేంద్రాలను ఆక్రమించారని అన్నారు. బీజేపీ, ఎంఐఎం అక్రమాలకు పాల్పడ్డా కూడా వారిని పట్టించుకోవడంలేదని, కేవలం బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కి కాషాయ భయం పట్టుకుందని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని అన్నారు సంజయ్.

దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేంద్ర నాయకత్వం కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: