దేశ రాజధానిలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టేనా..?

NAGARJUNA NAKKA
దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్‌ వేవ్‌ మొదలయిందని ఢిల్లీ ఆరోగ్యమంత్రి చెబుతున్నారు. మరోపక్క ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లకు కొరత ఏర్పడుతోంది. మరో నెల రోజుల పాటు కరోనా కేసులు అమాంతం పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఢిల్లీలో థర్డ్ వేవ్ కరోనా వైరస్ మొదలైందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ దాటి.. థర్డ్ వేవ్‌ లోకి ప్రవేశించిందని. అది కూడా పీక్ స్టేజ్ లో ఉందని తెలిపారు. అయితే మళ్ళీ లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తున్నామని, ప్రతి వ్యక్తీ మాస్కులు ధరించడమే పరిష్కారమని  ఆయన చెప్పారు. లాక్ డౌన్ పై వినిపిస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.

కొద్ది రోజులుగా రాజధానిలో రోజుకు వందమంది వరకు కరోనా రోగులు చనిపోతున్నారు. మూడు వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 95 మంది కరోనా రోగులు మృతి చెందారు. హస్తినలో కేసులు పెరిగిపోతుండటం పై హోం మంత్రి అమిత్ షా సైతం ఆందోళన వ్యక్తం చేసి.. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే నగర హాస్పిటల్స్ లో 750 ఐ సీ యూ పడకలను ఏర్పాటు చేస్తామని  ప్రకటించారు. రోజువారీ కరోనా టెస్టులను ప్రస్తుతమున్న 60 వేల నుంచి లక్షకు పెంచుతామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

రాబోయే రోజుల్లో ఢిల్లీలో రోజుకు 15వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.  అక్టోబర్ 20 నుంచే దేశ రాజధానిలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న రోగులకు వైద్యం అందించటానికి రాజధానిలో బెడ్లు ఉన్నాయి కానీ.. ఐసీయూ బెడ్లకు కొరత ఏర్పడింది. మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: