ఢిల్లీలో కరోనా కేసుల విజృంభణ..!

NAGARJUNA NAKKA
ఢిల్లీలో కరోనా కేసులు దుమ్ము రేపుతున్నాయి. సెకండ్ వేవ్ వచ్చిందా .. లేక థర్డ్ వేవ్ నడుస్తోందా అనేది అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయింది పాలనా యంత్రంగం. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ప్రతీ నలుగురిలో ఒకరికి, ప్రతీ ఇంట్లో ఒకరికి కోవిడ్ సోకిందని చెబుతున్నాయి సీరో సర్వేలు. కేసులు పెరుగుతున్న తీరుపై ఆందోళన చెందుతున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

దేశ రాజధానిలో పొల్యూషన్‌తో పోటీ పడుతూ పెరుగుతున్నాయి కరోనా కేసులు. ప్రతీ రోజూ వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,235 మంది కరోనా బారిన పడ్డారు. 95 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.85 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య7,614కు పెరిగింది. పాజిటివిటీ రేటు 15.33 శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పండగ సీజన్‌ కావడం, దిల్లీలో కాలుష్యం పెరగడం పాజిటివిటీ రేటు పెరగడానికి కారణమని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.  బుధవారం దిల్లీలో 8,593 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.

దేశ రాజధానిలో కేసులు పెరగడంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్‌ గవర్నర్‌, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్‌ హాజరయ్యారు. నగరంలో మళ్లీ కఠిన ఆంక్షలు విధించడం, పరిస్థితిని బట్టి బెడ్ల సంఖ్య పెంచడం లాంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. రానున్న రోజుల్లో ఢిల్లీలో చలిగాలుల తీవ్రత మరింత పెరగనుంది. కరోనా, వాయు కాలుష్యానికి చలిగాలులు తోడైతే.. వైరస్ వేగంగా విస్తరిస్తుంది. వైరస్‌ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది.

ఏదైనా వైరస్‌కు సెకండ్ వేవ్ వస్తే చాలా తీవ్రంగా ఉంటుందని.. ఢిల్లీ లాంటి అధిక జనసాంద్రత ఉన్న నగరాల్లో ముప్పు ఎక్కువని ఇప్పటికే వైద్యులు హెచ్చరించారు. రానున్న రోజుల్లోనూ ఢిల్లీలో కాలుష్యం తగ్గే అవకాశం కనిపించడం లేదు. చలిగాలులు పెరిగి, మంచు కురవడం ప్రారంభమైతే.. కాలుష్యం ఎక్కడిదక్కడే ఉండిపోతుంది. ఇది మరింత ప్రమాదకరం. ఏ విధంగా చూసినా..డిసెంబర్, జనవరిలో ఢిల్లీ మరింత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. హస్తినలో కరోనా కట్టడికి రానున్న రోజుల్లో మరిన్ని కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: