వాళ్లలా.. ఇపుడు ఎవరూ లేరా..?

NAGARJUNA NAKKA
ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలితల తర్వాత.. రాజకీయాల్లో ఆ స్థాయి ప్రభావం చూపినవారు లేరు. తమిళ సినీపరిశ్రమలో మరో దిగ్గజనటుడు.. శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వివిధ రాజకీయపార్టీలతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. తన మొదటి సినిమాలోనే డీఎంకే భావజాలాన్ని ప్రచారం చేశారు. తర్వాత కాలంలో డీఎంకే నుంచి తప్పుకొని తమిళగ మున్నెట్ర మున్ననై పేరుతో సొంతగా పార్టీ పెట్టారు.
1989లో జరిగిన ఎన్నికల్లో.. శివాజీ గణేషన్‌ పార్టీకి దారుణ ఓటమి ఎదురైంది. తిరువాయిర్ స్థానం నుంచి పోటీ చేసిన తానే ఓడిపోవడం.. శివాజీని బాగా బాధపెట్టింది. ఆ తర్వాత తన పార్టీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. కార్యకర్తలను జనతాదళ్‌లో చేరాలని సూచించారు.

మరో తమిళ సినీనటుడు విజయ్ కాంత్ కూడా 2005లో దేశియ ముర్పోర్కు ద్రవిడ కళగం పేరుతో సొంత పార్టీ పెట్టారు. 2006 ఎన్నికల్లో.. రాష్ట్రంలోని 234 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టారు. అయితే, కేవలం విజయ్‌కాంత్‌ మాత్రమే గెలుపొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కాంత్‌ అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయగా.. అప్పుడు 29 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే, 2014 ఎన్నికల్లో 104 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన విజయ్‌ కాంత్‌ పార్టీ.. ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది.

తమిళనాట మరో ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ కూడా.. ఆల్‌ఇండియా సమతువ మక్కల్‌ కచ్చి అనే సొంత పార్టీని ప్రారంభించారు. మొదట డీఎంకేలో చేరిన శరత్‌కుమార్‌.. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత అన్నా డీఎంకేలో చేరి.. అక్కణ్నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టారుఅయితే ఆయనకు కూడా లక్‌ కలిసి రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. పార్టీని నడపడంలో విఫలమయ్యారు. తన పార్టీని వేరే పార్టీలో విలీనం చేసి ... మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు.

ఇక, తమిళనాడులో స్టార్‌హీరోగా వెలుగొందిన కమల్‌హాసన్‌ .. మక్కల్‌ నీది మయ్యం పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. 2018 ఫిబ్రవరి 21న పార్టీని ప్రకటించిన కమల్‌.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దింపారు. ఒక్క సీటు కూడా గెలవకపోయినా.. భారీసంఖ్యలో ఓట్లను సాధించగలిగారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఎంతవరకు కమల్‌ ప్రభావం ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: