దేశాన్ని వణికిస్తున్న చలిగాలులు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి చలితీవ్రత!

Amruth kumar
దేశమంతటా చలితీవ్రత పీక్‌కు చేరింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఎప్పటికంటే ఎక్కువగా ఈసారి చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినట్లుగానే… ఈ ఏడాది చలికాలం సాధారణాన్ని మించి ప్రభావం చూపుతోంది. చలి దెబ్బకు బయటకు రావాలంటేనే వణుకు పట్టే పరిస్థితి నెలకొంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేని వాతావరణం ఏర్పడింది. ఈ చలిగాలుల ప్రభావం ఉత్తర భారతంతో మాత్రమే ఆగకుండా… తెలుగు రాష్ట్రాలకూ తీవ్రంగా తాకింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చలితీవ్రత పెరిగింది. గత పదిహేను రోజులుగా చలిగాలుల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.



ఏపీలో వణుకు పుట్టిస్తున్న చలి! :
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. “మంచుతో గడ్డకట్టి పోతామా?” అన్న స్థాయిలో చలి దాడి చేస్తోంది. గత పదేళ్లుగా ఇలాంటి చలితీవ్రత చూడలేదని వృద్ధులు చెబుతున్నారు. ప్రకృతి పగబట్టినట్లుగా చలిగాలులు విడిచి పెట్టడం లేదు. ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలి దెబ్బకు నీళ్లు కూడా గడ్డకట్టి పోతున్నాయి. గిరిజనులు మంటలు వేసుకొని వెచ్చదనం పొందుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ, సాయంత్రం ఐదు గంటల నుంచే చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాధారణ జీవితం స్తంభించినట్టుగా కనిపిస్తోంది.



తెలంగాణలోనూ అదే దృశ్యం! :
తెలంగాణలో కూడా చలితీవ్రత అదే స్థాయిలో కొనసాగుతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ప్రజలు అవసరం లేకపోతే ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. చలిగాలుల ప్రభావంతో జలుబు, దగ్గు, జ్వరాలు వంటి రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో 7.8 డిగ్రీలు, పటాన్‌చెరులో 8.4 డిగ్రీలు, హైదరాబాద్‌లో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. చలితీవ్రత కారణంగా విద్యుత్ వినియోగం కూడా తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే… ఈసారి చలికాలం తెలుగు రాష్ట్రాలకు అసలు ఊరట ఇవ్వడం లేదు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ, చలి నుంచి రక్షణ పొందడమే ఇప్పుడు అత్యవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: