బడ్జెట్ మోజులో కంటెంట్ మరిచిన టాలీవుడ్? – కోట్లు పెడుతున్నారు కథ ఎక్కడ?

Amruth kumar
ఈ రోజుల్లో సినిమా అనగానే మొదట అడిగే ప్రశ్న ఒక్కటే. “బడ్జెట్ ఎంత?” పది కోట్లా? యాభై కోట్లా? వంద కోట్లా? కథ ఎలా ఉందన్న ప్రశ్న కంటే… బడ్జెట్ ఎంత పెట్టారన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది. పాన్ ఇండియా ట్రెండ్‌తో తెలుగు సినిమా స్థాయి దేశవ్యాప్తంగా పెరిగింది నిజమే. కానీ అదే సమయంలో బడ్జెట్ మోజు మిగతా సినిమాలన్నింటినీ మింగేస్తోందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు సినిమా స్థాయి బడ్జెట్‌తోనే డిసైడ్ చేస్తున్నారు. కథ బాగుందా? అంటే… “ఇంత బడ్జెట్ పెట్టారు కదా… బాగుండే ఉంటుంది” అన్న అంచనాతోనే ముందుకు వెళ్తున్నారు. దర్శకులు, రచయితల ఊహలకు నిర్మాతలు సులువుగా నమ్మేసి చెట్టు ఎక్కిస్తున్నారు. రిలీజ్ తర్వాత మాత్రం… ఒక్కసారిగా నేల మీద వదిలేస్తున్నారు. బడ్జెట్ పెరిగింది… కంటెంట్ తగ్గిందా? .. ఈ బడ్జెట్ మోజులో పడి చాలా మంది నిర్మాతలు కంటెంట్‌పై సరైన దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణ ఇండస్ట్రీలోనే వినిపిస్తోంది.


నిజమేనా? 2025లో వచ్చిన సినిమాలనే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే సమాధానం స్పష్టంగా కనిపిస్తుంది. టాలీవుడ్ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. ఎక్కువ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. రివ్యూ చేస్తే తెరపైకి వచ్చిన అసలు కారణం ఒక్కటే – కంటెంట్ వైఫల్యం.విచిత్రమేంటంటే… ఆ సినిమాల బడ్జెట్ మాత్రం చిన్నది కాదు. ఇప్పుడు ఓ చిన్న సినిమా అంటేనే కనీసం 5 కోట్లు. 5 నుంచి 20–30 కోట్ల మధ్యలో చాలానే సినిమాలు. 30 నుంచి 50, 70 కోట్ల మధ్యలో మరికొన్ని సినిమాలు. ఇవి అన్నీ టైర్–2, టైర్–3 కేటగిరీ చిత్రాలు. కానీ వీటి సక్సెస్ రేట్ చూస్తే… లాభం సంగతి పక్కనపెడితే, పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి. ఓటీటీలు రక్షించాయా… లేక అలవాటు చేశాయా? కొన్ని సినిమాలు ఓటీటీ డీల్స్ వల్ల గట్టెక్కాయి. మరికొన్ని సినిమాల విషయంలో ఓటీటీలు కూడా చేతులెత్తేశాయి. కంటెంట్‌పై డౌట్ రావడంతో కొన్ని ఓటీటీలు ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్లలేదు. కొన్ని చోట్ల “తోచినంత ఇచ్చి చేతులు దులుపుకున్నారు” అన్న మాటలు కూడా బయటకు వచ్చాయి.



ఇంతటి పరిస్థితికి అసలు కారణం ఏంటి అంటే… బలమైన కంటెంట్ లేకపోవడమే. నిజంగా కంటెంట్ ఉంటే థియేటర్ రిలీజ్ అవసరం లేకుండానే ఓటీటీలు పోటీ పడి మరీ డబ్బులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీలు రెండు రకాల బిజినెస్ స్ట్రాటజీలతో ముందుకెళ్తున్నాయి. థియేట్రికల్‌గా పెద్ద లాభం లేకపోయినా… అదే ప్రాఫిట్‌ను ఓటీటీ ఒప్పందంలో చూపిస్తున్నారు. థియేటర్లపై ఓటీటీ ఆధిపత్యం! .. నిర్మాతలు ఎక్కువగా ఓటీటీలపై ఆధారపడటమే థియేట్రికల్ రిలీజ్ విషయంలోనూ ఓటీటీల ఆధిపత్యం పెరగడానికి కారణమవుతోంది. కానీ ఇది దీర్ఘకాలంలో థియేటర్ వ్యవస్థకే కాదు… సినిమా క్రియేటివిటీకి కూడా ప్రమాదమే. బడ్జెట్ ఎంత పెడుతున్నారన్నది కాదు… కథ ఎంత బలంగా ఉంది అన్నదే అసలు సినిమా. ఈ నిజాన్ని మరిస్తే… కోట్లు పెట్టినా ఫలితం మాత్రం సున్నానే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: