ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. ఆరోగ్యశ్రీలో ఇక అవి కూడా..
వాస్తవానికి రాష్ట్రంలో కొవిడ్ కారణంగా చనిపోయినవారితోపాటు.. కొవిడ్ నుంచి కోలుకుని తర్వాత ఇతర సమస్యలతో ప్రాణాలు వదిలిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. కొవిడ్ నెగెటివ్ వచ్చిన తర్వాత వచ్చే ఇతర సమస్యలు ఆరోగ్యశ్రీ పరిధిలో కవర్ అయ్యేవి కావు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో కొవిడ్ తర్వాత వచ్చే సమస్యలతో పోరాడుతున్న పేదలకు మరింత ఊరట కలుగుతుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రులు ఎంత ధరలు వసూలు చేయాలో కూడా ఆ ఉత్తర్వుల్లో అధికారులు స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ ధరలు నిర్ణయించామన్నారు.
కరోనానుంచి కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలిగించేందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించి పోస్ట్ కోవిడ్ మేనేజ్ మెంట్ స్కీంని కొత్తగా ప్రవేశ పెట్టారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ స్కీంను తక్షణమే అమలు చేయాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి చెప్పారు.
పోస్ట్ కొవిడ్ మేనేజ్ మెంట్ స్కీంలో రోజూ గరిష్టంగా ఆరోగ్యశ్రీ పరిధిలో రూ.2930 అందిస్తారు. కన్సల్టేషన్ ఫీజు రూ.400తోపాటు.. పోషకాహారానికి రూ.200, నిర్థారణ పరీక్షలు, మందులకు రూ.700.. ఇలా వివిధ కేటగిరీల కింద దీనిని విభజించారు. మొత్తంగా పోస్ట్ కొవిడ్ మేనేజ్ మెంట్ స్కీమ్ లో ఒక రోగికి ఒకరోజుకి ఇచ్చే గరిష్ట మొత్తం రూ.2930గా నిర్థారించారు.