వారివలనే బీహార్ లో నిరుద్యోగం ఎక్కువైపోయింది: రాహుల్

Kothuru Ram Kumar
బీహార్‌లో ఎన్నికలకు ఇక రోజులు లెక్కపెట్టాల్సిందే. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఎన్డీయే కూటమిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో వెనుకబడిన ప్రాంతాలను ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా మరుగున పడేసిందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తీవ్ర ఆరోపణలు చేసారు. పశ్చిమ చెంపారన్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాహుల్ రెచ్చిపోయారు.
బీహార్‌లో స్థానికంగా ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఇక్కడ యువకుల్లో ప్రతిభ లేకపోవడం కాదని వాదించారు. కేవలం ఇక్కడ ఓ చేతకాని ముఖ్యమంత్రి ఉండటం వల్లే స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని రాహుల్ ఎద్దేవా చేసారు. బలహీనమైన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉండటం వల్లే ఇక్కడి యువకులకు ఈ దుస్థితి పట్టిందని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు, కరోనా వైరస్ కారణంగా పెట్టిన లాక్‌డౌన్ వలన ఎంతోమంది ప్రజలు తమ ఉపాధిని కోల్పోయారని విమర్శించారు.
ఇకపోతే, బీహార్‌లో ఓ వైపు తొలి విడత ఎన్నికలు జరుగుతున్న వేళ.. పలువురు రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తమ పార్టీపై అతిగా విమర్శలు చేస్తున్న చిరాగ్ పాశ్వాన్‌పై జేడీయూ రివర్స్ కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు చిరాగ్ పాశ్వాన్ బీ టీమ్‌గా మారిపోయాడని ఈ సందర్భంగా వారు నిప్పులు చెరిగారు. ఆయన రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లో కూడా ఏమి పీకలేరని ఎద్దేవా చేసింది.
అలాగే, బీహార్‌లోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని మోదీ.. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాల చూపు ప్రజల అవసరాలపై కాకుండా ఎప్పుడూ కమిషన్ల మీద మాత్రమే ఉండేదని ఆరోపించారు. ఇక దర్భంగలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. తమ లక్ష్యం అంతా ఆత్మనిర్భర బిహార్ వైపే అని పేర్కోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: