డిసెంబర్లో కొవిడ్ టీకా.. కండిషన్స్ అప్లై..

Deekshitha Reddy
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకాలపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా, ‘కొవాగ్జిన్‌’పై 3వ దశ క్లినికల్‌ పరీక్షలు మొదలుకాబోతున్నాయి. నవంబరులో దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26,000 మంది వలంటీర్లపై ఈ టీకాను పరీక్షించి చూస్తారు. కొవాగ్జిన్‌పై మూడోదశ పరీక్షలకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తమకు అనుమతి ఇచ్చినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఈ పరీక్షలు ఈ నవంబరులో మొదలై, వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయి. దేశంలో ఇంత భారీస్థాయిలో మూడో దశ పరీక్షలు నిర్వహిస్తున్న టీకా ఇదే కావడం విశేషం.
‘కొవాగ్జిన్‌’పై మూడోదశ పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో, ఈ టీకా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్‌- మే నాటికి టీకా విడుదలవుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో దీన్ని వినియోగించాలంటే ప్రభుత్వ అనుమతితో డిసెంబర్ లోనే టీకాను అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు. ఒకవేళ ‘అత్యవసర వినియోగ అనుమతి’ ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయిస్తే, అంతకంటే ముందే అంటే డిసెంబర్లోనే కొవాగ్జిన్ అందుబాటులోకి వస్తుంది.
చైనా, రష్యాల్లో అక్కడి ప్రభుత్వాలు చొరవ తీసుకొని కొవిడ్‌-19 టీకాలకు అత్యవసర అనుమతి ఇచ్చాయి. అందుకే పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకముందే టీకాలు అక్కడ వినియోగంలోకి వచ్చాయి. ఇప్పటివరకూ నిర్వహించిన పరీక్షల సమాచారం ఆధారంగా ‘కొవాగ్జిన్‌’కు అత్యవసర అనుమతి ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబరులో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పడాన్ని దీనికి సంకేతంగా భావించాలంటున్నారు వైద్య నిపుణులు. ఇలాంటి అనుమతి లభిస్తే, తొలిదశలో టీకాను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, నర్సులు, అత్యసవర సేవల్లో నిమగ్నమైన వారు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగానికి చెందిన సిబ్బంది, టీచర్లు.. తదితరులకు ఇచ్చే వీలుంటుంది. కొవాగ్జిన్‌పై పరీక్షలు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటంపై దృష్టి సారించింది. రెండో యూనిట్ ని కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌ నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తవుతుందని భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయిప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా టీకా ధర ఉంటుందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: