పూజారి హత్యకేసులో ఒకడు దొరికాడు..!

NAGARJUNA NAKKA
రాజస్థాన్‌లో భూకబ్జాదారుల చేతిలో పూజారి హత్యకు గురైన కేసులో విచారణ ముమ్మరమైంది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రమేయమున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కైలాశ్‌ మీనాను అరెస్ట్ చేశారు. నిందితులపై మర్డర్‌ కేసు నమోదు చేశారు.

భూకబ్జాదారుల చేతిలో రాజస్థాన్ పూజారి హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా...ఇప్పటి వరకు కేవలం ఒక్క నిందితుడిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.

ఆలయ పూజారి హత్య దురదృష్టకరమన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లాట్.  నిందితులను కఠినంగా శిక్షిస్తామని.. మృతుని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆలయ పూజారి కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికే పదిలక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, పీఎం ఆవాస్ యోజన కింద లక్షన్నర సాయం అందజేస్తామని తెలిపింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహారంలో స్థానిక ఎస్‌హెచ్ఓ, పట్వారిని సస్పెండ్ చేసింది.  

పూజారి హత్యపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని  మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో నేరగాళ్లు చెలరేగిపోతున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆరోపించారు. ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ పర్యటనలు చేయడానికి బదులు... రాజస్థాన్‌లో జరుగుతున్న ఘోరాలపై అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

మొత్తానికి రాజస్థాన్ లో భూ బకాసురుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన పూజారి కేసులో దర్యాప్తు వేగవంతమైంది.  ఈ విషయంలో లోతుగా విచారణ చేపడుతున్న పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య కేసులో మొత్తం ఐదుగురికి సంబంధం ఉన్నట్టు తేల్చిన పోలీసులు.. ప్రధాన నిందితుడైన కైలాశ్ మీనాను ఆరెస్ట్ చేయడంతో ఆసక్తి నెలకొంది.  నిందితులపై ఇప్పటికే హత్య కేసు నమోదు చేశారు.











మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: