అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల డిమండ్ లు ఇవే..!
హాథ్రస్ కేసు మొదటి నుంచి సంచలనమే. బాధితురాలి మృతి, అర్థరాత్రి అంత్యక్రియలు, నిందితుల వాదనలు ఇలా... ప్రతీది అనుమానస్పదమే. దీంతో అసలేం జరిగిందో తెలుసుకునేందుకు...అలహాబాద్ హైకోర్టు స్వయంగా రంగంలోకి దిగింది. యూపీ పోలీసులు, అధికారుల తీరుపై విమర్శలు రావడంతో... ఈ వ్యహారాన్ని పరిశీలనకు తీసుకుంది. దీంతో బాధిత కుటుంబం సోమవారం లక్నో బెంచ్ ముందు హాజరయ్యారు. వారి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది ధర్మాసనం. బాధితుల తరఫున హాథ్రస్ మెజిస్ట్రేట్ నోడల్ అధికారిగా వ్యవహరించారు.
లక్నో బెంచ్ ముందు మూడు ప్రధాన డిమాండ్‌లు ఉంచారు. సీబీఐ రిపోర్టును గోప్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. కేసు విచారణ యూపీ బయట చేసేలా చూడాలని కోరారు. అంతేకాదు కోర్టు విచారణ పూర్తయ్యే వరతమకు రక్షణ కల్పించాలని కోర్టును కోరారు. దీనిపై విచారణను నవంబర్ 2కు వాయిదా వేసింది ధర్మాసనం. ఇటు అడిషనల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఇతర అధికారులు ధర్మాసనం ముందు హాజరయ్యారు.
యూపీ సర్కార్‌పై మరోసారి ఫైరయ్యారు రాహుల్, ప్రియాంక. యోగి ప్రభుత్వం అనైతికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నిందితులను జైల్లో వేయాల్సింది పోయి... వారితో రోజుకో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తోందని ఆరోపించారు. ఇటు అధికారులు కూడా బాధితురాలి కుటుంబాన్నే అనుమానిస్తున్నారని, యూపీలో మహిళలకు రక్షణ లేదని ఆరోపించారు.
ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఆదివారం తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే హాథ్రస్ పోలీసులు కేసు డైరీని సీబీఐకి అప్పగించారు. అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం, ఫోరెన్సిక్ రిపోర్టుపై అనుమానాలు, యువతిని ఆమె తల్లిదండ్రులు చంపారని నిందితుల లేఖ రాయడంపై నిజనిజాలేంటో తేల్చనుంది కేంద్ర దర్యాప్తు బృందం.