సుశాంత్ మరణంపై మళ్లీ ట్విస్ట్..!
బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో... సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ ముంబయిలోని బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. బాలీవుడ్ నటుడి మృతిపై వస్తున్న అనుమానాలకు తెరదించుతూ.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య కాదని, అది ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ల బృందం ప్రకటించింది. సీబీఐకి మెడికో లీగల్ ఒపీనియన్‌ని తెలియజేసింది. సుశాంత్ పోస్ట్‌మార్టం రిపోర్టులను సమగ్రంగా విశ్లేషించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది. ఇది సూసైడ్ కేసే తప్ప, మర్డర్ కేసు కాదని ఘటనా స్థలం వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వెల్లడైందని తేల్చి చెప్పింది. దీంతో సుశాంత్ సూసైడ్ కోణంలో సీబీఐ దర్యాప్తు చేయనుంది.
సుశాంత్ సూసైడ్ చేసుకున్నారని, ఎలాంటి హత్యా ప్రయత్నం జరగలేదని ఎయిమ్స్ వైద్యుల బృందం రిపోర్ట్ ఇవ్వడంపై ముంబయి పోలీసులు స్పందించారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రకటనల ద్వారా గందరగోళం సృష్టించారన్నారు. దర్యాప్తు ఆరంభంలోనే సుశాంత్ సూసైడ్ చేసుకున్నారని తాము చెప్పామని ముంబై పోలీసులు గుర్తు చేశారు. మొదటి నుంచి వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్లామన్నారు.
మరోవైపు.. సుశాంత్ మృతి కేసులో... ముంబయి పోలీసుల ప్రతిష్ట దిగజార్చిన రాజకీయ నేతలు, వార్తా ఛానెళ్లు మహారాష్ట్రకు క్షమాపణలు చెప్పాలని శివసేన సామ్నా పత్రికలో డిమాండ్ చేసింది. ఈ కుట్రలో భాగమైనవారిపై ప్రభుత్వం పరువునష్టం దావా వేయాలని సూచించింది. హథ్రాస్‌లో దళిత యువతిపై సామూహిక లైంగిక దాడిపై నోరుమెదపని వారు మహారాష్ట్ర నిబద్ధతను ప్రశ్నించలేరని అంది.. ముంబైని పీఓకేతో పోల్చిన నటి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని కంగనా రనౌత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించింది.