ఏపీలో ప్లాస్మా వ్యాపారం.. ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా..?
అయితే కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలి అంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ప్లాస్మా దానం చేసిన వారికి 5వేల రూపాయల ప్రోత్సాహకం అందించేందుకు కూడా నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్మాను వ్యాపారంగా మార్చుకుని కొంతమంది విచ్చలవిడిగా ప్లాస్మా అమ్మకాలు చేస్తున్నారు అన్న వాదన వినిపిస్తోంది. ప్లాస్మా కావాల్సిన వారు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని అంటూ ప్రకటనలు చేసి.. తర్వాత వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
అటు ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా ప్లాస్మా కోసం భారీగా బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే నెల్లూరు జిల్లాలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో ఓ వ్యక్తి ప్లాస్మా ఇవ్వడానికి వచ్చాడు. ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు కాకుండా మరిన్ని డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏ బాధితుడికి అయితే ప్లాస్మా అవసరమో వారి కుటుంబీకులకు సంప్రదించి... వారితో బేరసారాలకు దిగారు. వాళ్లు కూడా ఎక్కువ డబ్బులు ఇవ్వలేము అని చెప్పడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే అటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులలో కూడా ప్లాస్మా కి 14 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాపారం కాస్త ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.