రాష్ట్రంలో రైతులకిచ్చే ఉచిత విద్యుత్ కి నగదు బదిలీ పథకం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో అధికార పక్షంలోనే కాస్త గందరగోళం నెలకొంది. సంస్కరణల్లో భాగంగానే నగదు బదిలీకి శ్రీకారం చుట్టామంటూ అధికారులు చెబుతున్నా, మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం స్థానికంగా సెగ తగులుతూనే ఉంది. తాజాగా విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏకంగా రాజీనామా వరకు వెళ్లారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రాజీనామా వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
నగదు బదిలీ పథకంతో ఉచిత విద్యుత్ కు వచ్చిన ఢోకే ఏమీ లేదని, రైతులపై భారం పడదని వివరించాల్సింది పోయి, రాజీనామా చేస్తామనడం సబబు కాదని సీఎం జగన్ బాలినేనితో చెప్పినట్టు సమాచారం. రైతులపై రూపాయి భారం పడినా విద్యుత్ శాఖ మంత్రిగా తాను రాజీనామా చేస్తానంటూ ఎమోషనల్ గా మాట్లాడారు బాలినేని. ఆయన వ్యాఖ్యల సారాంశం కూడా రైతులపై ప్రభుత్వం భారం వేయదు, జగన్ సర్కారు అలాంటి చర్యలకు పాల్పడదు అని చెప్పడమే. అయితే టీడీపీ అనుకూల మీడియా మంత్రి వ్యాఖ్యలకు లేనిపోని ప్రాధాన్యత ఇచ్చింది. అలా చేస్తే రాజీనామా చేస్తానన్న బాలినేని అంటూ బ్రేకింగ్స్ నడిపారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ హయాంలో ఇప్పటి వరకూ ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కచ్చితంగా ప్రజలకు ఈ పనిచేస్తాం, అందుకోసమే కదా మేముంది, అని చెప్పారే కానీ, చేయలేకపోతే రాజీనామా చేస్తామనే వరకు ఎవరూ వెళ్లలేదు. తొలిసారి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేస్తానంటూ చెప్పే సరికి వైసీపీ శ్రేణుల్లోనే కలవరం మొదలైంది. అందులో మీడియా అంతా రాజీనామా వ్యవహారాన్ని ఒత్తి మరీ చెబుతుండే సరికి అసలేంజరిగిందని అందరూ ఆరా తీశారు. రైతులకు నష్టం కలుగుతుంది కదా, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కదా అని ఓ మీడియా ప్రతినిధి పదే పదే ప్రశ్నించడంతో.. ప్రజలపై రూపాయి భారం పడినా తాను రాజీనామా చేస్తానని బాలినేని చెప్పారు. చివరకు సీఎం జగన్ ఈ విషయంపై సీరియస్ కావడం ఈ వ్యవహారంలో మరో మలుపు.