ఏపీలో మరో గ్యాస్ లీకేజీ ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం..
ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన వారంతా మహిళలే. వారిలో ముగ్గురి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో వారిని తిరుపతికి తరలించారు. అస్వస్థతకు గురయిన మిగిలిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగింది.. ఎలా జరిగింది.. ఓసారి పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎం.బండపల్లిలోని హట్సన్ పాల డెయిరీ ఉంది. గురువారం రాత్రి గ్యాస్ లీకైంది. కోల్డేజ్ ప్లాంటుకు వెళ్లే పైప్లైన్కు వెల్డింగ్ చేస్తుండగా అమ్మోనియం గ్యాస్ లీకైనట్లు కార్మికులు తెలిపారు.
ఈ లీకేజీ గుర్తించిన కార్మికులు అప్రమత్తమై దాన్ని నిలిపేశారు. అప్పటికే ప్రొడక్షన్ యూనిట్లో పని చేస్తున్న మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురికి సీరియస్గా ఉండటంతో తిరుపతి తరలించారు. విషయం తెలియగానే.. కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ రాత్రే పాల డెయిరీని సందర్శించారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన వారి కుటుంబసభ్యులు డెయిరీ వద్ద ఆందోళన చేపట్టారు. కలెక్టర్, ఎస్పీ వారికి సర్ది చెప్పారు.
హట్సాన్ పాల డైరీ ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సంఘటన జరిగిన తీరును పరిశ్రమ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఘటన గురించి తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే విచారణకు ఆదేశించారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, అగ్నిమాపక శాఖ సంయుక్తంగా విచారణ చేయాలని ఆదేశించారు.