జగన్ ఐడియా.. అదిరిపోయిందిగా.. అంతటా ప్రశంసలు..!?
రైతు భరోసా, అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత వంటి..ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ సర్కారు గ్రామవాలంటీర్ల ద్వారానే అందజేస్తోంది. తాజాగా వైఎస్సార్ చేయూత ద్వారా 25లక్షలమంది మహిళలకు లబ్ది చేకూర్చారు. కరోనా సమయంలోనూ గ్రామ వాలంటీర్ల సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి. గ్రామాల్లోని కరోనా పేషెంట్ల వివరాలు సకాలంలో సక్రమంగా ప్రభుత్వానికి అందడంలో ఈ గ్రామ వాలంటీర్లు అందించిన సేవలపై ఇప్పుడు ప్రశంసలు దక్కుతున్నాయి.
కరోనా సమయంలోనూ వీరు ఆపదను లెక్క చేయకుండా కరోనా రోగుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతున్నారు. మందులు అందిస్తున్నారు. కరోనా వైద్య సేవలను సమన్వయ పరచుకుంటున్నారు. అందుకే ఇటీవల సీఎం జగన్ సైతం.. వలంటీర్ వ్యవస్థను చూసి గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా వలంటీర్ల వ్యవస్థను సీఎం వైయస్ జగన్ ప్రశంసించారు.
అవినీతి రహిత పరిపాలన కోసం, అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారి ఇంటి గుమ్మం ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామ వలంటీర్ల వ్యవస్థను సంవత్సరం క్రితం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కూల పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ ఆకాంక్షల మేరకు అద్బుతమైన సేవలందిస్తున్న వలంటీర్ వ్యవస్థను చూసి గర్విస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మెచ్చుకోవడం విశేషం.