కరోనా గురించి మరో శుభవార్త... వైరస్ కట్టడి సాధ్యమే....?

Reddy P Rajasekhar
గత కొన్ని నెలలుగా మానవాళిని కరోనా మహమ్మారి తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తల పరిశోధనల్లో వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ బలహీనతలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు విసృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో వైరస్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
 
అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వైరస్ కొమ్ములో ఉండే చీలికను గుర్తించారు. ఈ చీలిక వల్ల వైరస్ ను సులభంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వైరస్ కొమ్ములో ఉండే ఈ చీలిక వల్ల కరోనాకు మెరుగైన చికిత్స అందేలా ఔషధాలు, వ్యాక్సిన్ల రూపకల్పన చేయవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ వల్ల మనిషి శరీర కణాల్లోకి ప్రవేశిస్తుందన్న సంగతి తెలిసిందే.
 
కరోనా స్పైక్ ప్రోటీన్ మానవ శరీర కణానికి అంటుకునే ప్రాంతానికి కొన్ని నానోమీటర్ల దూరంలో ఓ చీలిక లాంటిది ఉందని ఈ చీలికకు ధనావేశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్త మోనికా ఒలివేరా డిలా క్రజ్‌ ధనావేశం ఉన్న చీలికకు రుణావేశం జోడించడం ద్వారా వైరస్‌ కణానికి అతుక్కోవడం నిలిచిపోతుందని తాము గుర్తించామని చెప్పారు. వైరస్ జన్యు క్రమంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని... ఈ మార్పుల వల్ల వైరస్‌ వ్యాప్తి వేగం తగ్గిందని పరిశోధనలు చెబుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
 
మరోవైపు కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు రష్యా నుంచి తొలి వ్యాక్సిన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే మూడవ దశ మానవ ప్రయోగాలు పూర్తి కాకుండా రష్యా వ్యాక్సిన్ ను విడుదల చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా మాత్రం వ్యాక్సిన్ మంచి ఫలితాలు ఇస్తోందని... లాటిన్‌ అమెరికా దేశాలతోపాటు ఆసియా దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని  తెలిపింది. మరోవైపు ఈ వ్యాక్సిన్ కు వేగంగా అనుమతులు ఇవ్వడంపై సైతం శాస్త్రవేత్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: