23కు చేరిన కేరళ విమాన ప్రమాద మృతుల సంఖ్య !

NAGARJUNA NAKKA
కేరళ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరింది. విమానం క్రాష్‌ లాండ్‌ అయినప్పుడు పైలట్‌ దీపక్‌ వసంత్‌ సాథే ప్రదర్శించిన సమయస్ఫూర్తిని పలువురు ప్రశంసిస్తున్నారు. మరోవైపు... బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దీపక్‌తో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు స్నేహితులు.
కోజికోడ్ విమానాశ్రయంలో రన్‌ వే చాలా చిన్నది. దీనికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. విజిబిలిటీ తగ్గడంతో పాటు రన్‌వే చిత్తడిగా ఉంది.  దీంతో విమానం క్రాష్ ‌ల్యాండ్ అయింది. అయితే ఇంతటి విపత్కర  పరిస్థితుల్లో కూడా పైలెట్‌ దీపక్ వసంత్‌ సాథే ప్రదర్శించిన సమయ స్ఫూర్తి వల్ల ప్రాణ నష్టం అనూహ్యంగా తగ్గింది.
సాధారణంగా విమానం క్రాష్‌ ల్యాండ్ అయినప్పుడు మంటలు చెలరేగుతాయి. ఫలితంగా ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. కానీ... దీపక్‌ సాథే ముందుగానే ఇంజన్‌ ఆఫ్‌ చేయడం వల్ల మంటల రేగే అవకాశం లేకపోయింది.  అందువల్లే ప్రమాద తీవ్రత తగ్గిందని అంతా ప్రశంసిస్తున్నారు.
పైలెట్‌గా వసంత్‌ సాథేకు చాలా అనుభవం ఉంది. హైదరాబాద్‌తో కూడా అనుబంధం ఉంది. 1981లో దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేశారాయన. అత్యుత్తమ ప్రతిభకు స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ అందుకున్నారు. ఖడక్‌ వస్లాలోని ఎన్డీఏ  అకాడమీలో స్వర్ణ పతకం సాధించారు. అనంతరం భారత వైమానిక దళంలో వింగ్‌ కమాండర్‌గా పనిచేశారు. కార్గిల్‌ యుద్ధంలోనూ పాల్గొన్నారు. 2003లో రిటైర్ మెంట్  తీసుకొని... కమర్షియల్‌ పైలెట్‌గా పని చేస్తున్నారు దీపక్‌ సాథే. వృత్తిపట్ల ఎంతో నిబద్ధత కలిగిన దీపక్‌ సాథేకు... దేశంలోనే అత్యుత్తమ పైలెట్లగా గుర్తింపు ఉంది. దీపక్‌ సాథేకు భార్యతో పాటు ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లిద్దరూ ముంబై ఐఐటీలో చదువుకున్నారు. ఆయన భార్యతో కలిసి ముంబైలో నివసిస్తుండగా, కొడుకుల్లో ఒకరు బెంగళూరులో పనిచేస్తుంటే... మరొకరు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు.
దీపక్‌ సాథే బహుముఖ ప్రజ్ఞాశాలి. తన కొడుకు చిన్నప్పటి నుంచి అన్నింటిలో ముందుండే వాడంటున్నారు దీపక్‌ సాథే తల్లి నీలా సాథే. చదువుతో పాటు ఆటలు, గుర్రపు స్వారీలో అందరి కంటే ముందుండే వాడని గుర్తు చేసుకున్నారు.  చాలా మంచివాడని... ఇటీవల కరోనా కష్టకాలంలో చాలా మందిని ఆదుకున్నాడని ఆమె  కన్నీళ్లు పెట్టుకున్నారు.
విమాన ప్రమాదంలో పైలెట్‌ దీపక్‌ వసంత సాథే మృతితో... ముంబై నిహార్‌ ప్రాంతంలోని అతని ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. దీపక్‌ వసంత్‌ సాథే చాలా  మంచి వ్యక్తి అంటున్నారు ఇరుగుపొరుగు వాళ్లు.
ఖాళీ సమయంలో స్క్వాష్ ఆడేవారు దీపక్‌ సాథే. అంతేకాదు... అతను మంచి సింగర్ కూడా.  ఓ కార్యక్రమంలో ఆయన పాడిన పాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 190 మంది ఉన్నారు. ప్రయాణికుల ప్రాణాలను రక్షించేందుకు చివరి క్షణం వరకూ ప్రయత్నించిన దీపక్‌ వసంత్‌ సాథే... చివరికి ప్రాణాలు కోల్పోవడం విచారకరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: