కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్... రెండు వారాల పిండానికి కూడా వైరస్ రిస్క్...?

Reddy P Rajasekhar
కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. భారత్ లో గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ 50,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో తక్కువ సంఖ్యలో నమోదవుతున్నా ఏపీలో పదివేలకు పైగా నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. వైరస్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
 
శాస్త్రవేత్తలు రెండు వారాల పిండానికి కూడా కరోనా రిస్క్ ఉందని ... పుట్టబోయే బిడ్డకు గర్భధారణ రెండవ వారం నుంచే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తల్లి అనారోగ్యానికి గురైతే పిండం వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పిండానికి కరోనా సోకితే వైరస్ పిండం గర్భంలోకి సరిగ్గా అమర్చగల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు తెలిపారు. వైరస్ పిండం ఆరోగ్యానికి కూడా ప్రమాదాలను కలిగిస్తుందని తెలిపారు.
 
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని నిపుణులు జన్యు వ్యక్తీకరణ డేటాను ఉపయోగించి అధ్యయనం చేసి ఈ విషయాలను వెల్లడించారు. పిండం కణాలు ఇన్ఫెక్ట్ అయినప్పటికీ చాలా కణాలు వైరస్ సోకిన తరువాత పూర్తిగా కోలుకుంటాయని సంస్థ తెలిపింది. అయితే గతంలో వచ్చిన నివేదికలు ఒక తల్లికి కరోనా వైరస్ సోకితే శిశువుకు ప్రమాదం ఉందని చెప్పాయి. లండన్ లో నవజాత శిశువు కరోనా బారిన పడింది.
 
గర్భిణీ స్త్రీలకు వైరస్ ఎక్కువ హాని కలిగించే అవకాశాలు ఉండటంతో వాళ్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను నియంత్రించటం సాధ్యమవుతుందని ప్రజలు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: