మంత్రిగా ఆ లేడీ అవుట్? కొత్త మంత్రులు వీళ్లే?
మంత్రి కొండా సురేఖని మంత్రి వర్గం నుంచి తొలగించడం దాదాపు ఖరారు అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే అదునుగా ఆమె రాజకీయ ప్రత్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. అధిష్ఠానానికి నేరుగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆమెతో తట్టుకోలేకపోతున్నామని.. తమ నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దీప్ దాస్ మున్షీ కి మొర పెట్టుకున్నారు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు.
హైకమాండ్ కు సైతం కంప్లైంట్ చేశారు. నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన కామెంట్లతో ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న హైకమాండ్.. ఈ కొత్త ఫిర్యాదుతో సురేఖ మీద మరింత సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను మంత్రి వర్గం నుంచి తప్పించడం ఖాయమనే ప్రచారం నడుస్తోంది. అయితే బీసీ మహిళ అయిన సురేఖను తప్పిస్తే.. సమస్యలు వస్తాయని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరో బీసీకే ఆమె స్థానంలో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
ప్రస్తుతం రేవంత్ మంత్రి వర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఇందులో నాలుగు మాత్రమే భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ నాలుగు మంత్రి పదవులతో పాటే సురేఖను తప్పిస్తే ఏర్పడే ఖాళీని సైతం భర్తీ చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీంతో సురేఖ అవుట్.. ఐదుగురు ఇన్ అనే చర్చ గాంధీ భవన్ లో జోరుగా సాగుతోంది. మరో నాలుగు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై కాంగ్రెస్ లో ఉత్కంఠ సాగుతోంది.
ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటామని గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరికి ఛాన్స్ పక్కా అనే ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్ నుంచి నుంచి మంత్రి వర్గంలో ఇప్పటి వరకు ఎవరికీ ఛాన్స్ దక్కలేదు. ఆ జిల్లా నుంచి వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావు లో ఒకరికి అవకాశం దక్కనుంది. దీంతో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ప్రచారం సాగుతోంది.