హైదరాబాద్‌లో స్థలం కొంటున్నారా.. ఇలాంటి వాళ్లతో జాగ్రత్త..?
సాధారణంగా ఇల్లో, స్థలమో కొనేటప్పుడు తెలిసిన వాళ్లను వాకబు చేస్తాం.. లేకపోతే.. పేరున్న సంస్థల ఆఫర్లు పరిశీలిస్తాం.. ఇలాంటి సంస్థలు.. ఆ భూములపై ముందు పెట్టుబడి పెడతాయి.. సౌకర్యాలు ఏర్పాటు చేస్తాయి.. ఆ తర్వాత మంచి ధర చూసుకుని అమ్ముతాయి. ఫ్లాట్ల వంటి వ్యాపారం చేసినా ముందస్తు అనుమతులు.. నిబంధనలు పక్కాగా ఫాలో అవుతాయి.
కానీ కొందరు మోసగాళ్లు ఎలాంటి పెట్టుబడి లేకుండా.. నామమాత్రపు సొమ్ముతో రంగంలోకి దిగుతారు. భూమి యజమాని నుంచి అడ్వాన్సు ఇచ్చి స్థలం తీసుకుంటారు. ఆ తర్వాత దాన్ని అందమైన బ్రౌచర్లు వేసి ప్లాట్లు లెక్కన అమ్మకానికి పెడతారు. తక్కువ రేటుకే ఇస్తున్నామని ప్రచారం కుంటారు. ఇలాంటి వాళ్ల చేతుల్లో పడితే ఇక అంతే సంగతులు .. ఎందుకంటే.. వాళ్లు మనం ఇచ్చిన డబ్బునే యజమానికి చెల్లిస్తారు.
కాబట్టి వీళ్ల దగ్గర ఎలాంటి అనుమతులూ పెద్దగా ఉండవు. అప్పటికి అప్పుడు అమ్ముకుని బయటపడే బ్యాచ్.. ఇలాంటి వాళ్ల దగ్గర ప్లాటు కానీ, ఫ్లాటు కానీ కొంటే ఆ తర్వాత ప్రతిదానికీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక్కడ అపార్ట్‌మెంట్, వాణిజ్య సముదాయం వస్తుందని.. అందులో మీకు ఫ్లాట్, వాణిజ్య స్థలం మార్కెట్ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని చెప్పి వీరు అమ్ముతుంటారు. అవిభాజ్యపు వాటా స్థలాన్ని కొనుగోలుదారుల పేరిట రిజిస్టర్ చేస్తుంచారు.
సాధారణంగా వీరు ఎకరా స్థలాన్ని 50 మంది వరకు అమ్ముతారు. తక్కువ ధరకే అమ్మడం వల్ల నిర్మాణం చేపట్టడానికి ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. నిర్మాణం పూర్తి చేసేందుకు మూడు నాలుగేళ్లయినా పడుతుంది. అందుకే ఇల్లు, ఫ్లాటు కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు అమ్మకందారు చరిత్ర గురించి తెలుసుకుంటే మంచిది.