ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన వైసీపీ మంత్రి...!?
చదువు పూర్తి చేసుకున్న యువత ప్రధాన లక్ష్యం మంచి ఉద్యోగం. మరి మంచి ఉద్యోగం రావాలంటే చదువుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉండాలి. అదొక్కటే సరిపోతుందా.. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టీమ్ లో పని చేయగలిగిన సామర్థ్యం ఉండాలి. మరి ఇవన్నీ మన విద్యాసంస్థలు చెబుతున్నాయా అంటే లేనే లేదని చెప్పాలి.
అందుకే ఈ లోటును భర్తీ చేసేందుకు ఏపీ సర్కారు కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే అక్టోబర్‌లో లాంఛనంగా 5 స్కిల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెబుతున్నారు. శనివారం ఆయన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కడప, పశ్చిమ గోదావరి, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో ఈ స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేస్తారు. వీటిని గాంధీ జయంతి రోజు ప్రారంభిస్తారు. అంతే కాదు.. ఇది శాంపిల్ అన్నమాట. వచ్చే ఏడాది కొత్తగా మరో 25 స్కిల్ కాలేజీల ప్రారంభానికి సన్నద్దం కావాలని గౌతమ్ రెడ్డి అధికారులకు సూచించారు. అనుకున్న సమయానికి అనుకున్నవి పూర్తి చేసేలా కార్యాచరణ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ స్కిల్ కాలేజీలన్నింటినీ సమన్వయం చేసుకునేందుకు ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్’ను కూడా ఏర్పాటు చేస్తారట. అయితే వీటికి నిధుల ఇబ్బంది లేకుండా సీఎస్ఆర్ నిధులను రాబడతారట. నిజంగా ఇది నిరుద్యోగులకు తీపి కబురే.