విజయవాడ వాసులకు షాకింగ్ న్యూస్... నగరంలో కరోనా కట్టడికి ఆంక్షలు....?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొన్ని రోజులుగా కృష్ణా జిల్లాలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 359 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 4,841కు చేరింది. నమోదవుతున్న కేసుల్లో విజయవాడ నగరంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి విజయవాడ నగరంలో ఆంక్షలు విధించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. 
 
నగరంలోని 11 ప్రాంతాలను జియోగ్రాఫికల్ క్వారంటైన్ ప్రాంతాలుగా గుర్తించామని... పటమట, కృష్ణలంక, కొత్తపేట, విధ్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, భవానిపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించ్ పేట, చిట్టినగర్ ప్రాంతాలలో ఆంక్షలు అమలవుతాయని చెప్పారు. వారం రోజులపాటు పకడ్బందీగా బారికేడింగ్ చేసి ప్రజలందరినీ ఒకేదారిగుండా వచ్చిపోయే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. 
 
శనివారం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అన్ని వ్యాపార సంస్థలకు అనుమతిస్తామని.... నిత్యావసరాలు, మెడికల్ షాపులు యధాతథంగా కొనసాగుతాయని అన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. 
 
రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులతో కలిపి కరోనా బాధితుల సంఖ్య 77,963కు చేరింది. రాష్ట్రంలో కోలుకున్న కేసులతో పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఏపీలో ప్రస్తుతం 39,832 యాక్టివ్ కేసులు ఉండగా 37,198 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 933 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. 
                                  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: