గవర్నర్ తో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ... ఆ విషయాల గురించే ప్రధానంగా చర్చ....?

Reddy P Rajasekhar

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. సచివాలయం కూల్చివేత, కరోనా పరిస్థితి, తదితర అంశాల గురించి సీఎం ప్రధానంగా చర్చించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో చోటు చేసుకున్న వివిధ పరిణామాల వల్ల వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో తీవ్రంగా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న కేసీఆర్ వివరించారు. 
 
రాష్ట్రంలో కరోనా పరీక్షల గురించి భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతూ ఉండటంతో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను కేసీఆర్ గవర్నర్ కు అందజేసినట్టు తెలుస్తోంది. పాత సచివాలయాన్ని కూల్చివేయడంతో త్వరలో జరగబోయే కేబినెట్ లో సచివాలయ నిర్మాణం గురించి తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు సీఎం గవర్నర్ కు చెప్పారని సమాచారం. గత కొన్నిరోజులుగా గవర్నర్ కు, సీఎంకు మధ్య గ్యాప్ పెరిగిపోయిందని వార్తలు వచ్చాయి. 
 
మరోవైపు హైకోర్టు తెలంగాణ సర్కార్ కు కరోనా పరీక్షల విషయంలో పదేపదే మొట్టికాయలు వేస్తోంది. ఈరోజు జరిగిన భేటీ ద్వారా గవర్నర్ కు సీఎం కేసీఆర్ అన్ని అంశాలకు సంబంధించిన వివరణ ఇచ్చారని సమాచారం. గత కొన్ని రోజులుగా తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 45,076కు చేరింది. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,65,219 మందికి పరీక్షలు నిర్వహించారు. మరోవైపు నేడు తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రం కరోనా పరీక్షల విషయంలో వెనుకబడి ఉందని వ్యాఖ్యలు చేసింది. కేసులు పెరుగుతోంటే ప్రభుత్వం నిద్రపోతుందని.... హైకోర్టు మొట్టికాయలు వేస్తుంటే ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: