అన్ లాక్ 2.0 : కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్.... ?

Reddy P Rajasekhar

భారత్ పై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత ప్రతిరోజూ దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ ను కంట్రోల్ చేయడం సాధ్యం కావడం లేదు. భారత్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉంది. దేశంలో కరోనా సోకిన రోగులు త్వరగానే కోలుకుంటున్నారు. 
 
సాధారణంగా కరోనా సోకిన రోగులు కోలుకోవాలంటే 14 రోజుల సమయం పడుతుంది. కొందరు రోగులకు అంతకు మించి సమయం పడుతుంది. కరోనా సోకిన వాళ్లు వైరస్ నుంచి కోలుకుంటే వాళ్లలో మళ్లీ వైరస్ సోకకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే సంగతి తెలిసిందే. కానీ తాజాగా కింగ్స్ కాలేజ్ లండను చెందిన పరిశోధకులు చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. తాజా పరిశోధనల్లో కరోనా రోగుల్లో రోగి కోలుకున్న 3 నెలల్లో శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి పోతుందని తేలింది. 
 
కరోనా నుంచి కోలుకున్న తర్వాత రోగుల్లో 90 రోజుల పాటు యాంటీబాడీలు అలాగే ఉన్నాయని.... యాంటీబాడీలు ఉన్నవాళ్లు వైరస్ భారీన పడే అవకాశం తక్కువని... అయితే 3 నెలల తర్వాత కోలుకున్న రోగులు ఇమ్యూనిటీని కోల్పోయారని వాళ్లు చెబుతున్నారు. కరోనా సోకిన రోగులకు మరలా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని... అందువల్ల వాళ్లు మళ్లీ కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
సాధారణంగా ఒకసారి ఏదైనా వైరస్ సోకి కోలుకున్నామంటే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. రెండోసారి వైరస్ శరీరంలోకి ప్రవేశించినా అవి ప్రభావం చూపలేవు. కానీ కరోనా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. మళ్లీ కరోనా సోకే అవకాశం ఉండటంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు వైరస్ నియంత్రణ సాధ్యం కాదని... త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: